మరో పోరాటానికి సిద్ధమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
ఆ మధ్య మైనార్టీల సమస్యలకోసం గళమెత్తారు ఎమ్మెల్యే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆయన నిరసన కార్యక్రమాలకు పోలీసుల అనుమతివ్వలేదు. ఇప్పుడు రూరల్ నియోజకవర్గంలో జల దీక్ష చేపడతానని ప్రకటించారు.
ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి పార్టీకి దూరంగా జరిగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. అయితే ఇప్పుడాయన అధికార పార్టీ ఎమ్మెల్యే కాదు. వాస్తవానికి గతంలో కూడా తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగలేదని, అందుకే తాను అధికారులతో విభేదించానని చెప్పుకొచ్చేవారు కోటంరెడ్డి. ఇప్పుడు తనను పార్టీ పక్కనపెట్టిందని, ఇప్పుడు తన నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తుందనే అంచనాలు తనకు లేవన్నారు. కానీ తనపై కోపంతో అయినా నియోజకవర్గానికి నిధులు విడుదల చేస్తారనే ఆశ ఉందని గతంలో కూడా చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.
ఆమధ్య నియోజకవర్గంలోని మైనార్టీల సమస్యలకోసం గళమెత్తారు ఎమ్మెల్యే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆయన నిరసన కార్యక్రమాలకు పోలీసుల అనుమతివ్వలేదు. దీంతో ఆయన తన కార్యాలయంలోనే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు రూరల్ నియోజకవర్గంలో జల దీక్ష చేపడతానని ప్రకటించారు.
ఏప్రిల్ లో జలదీక్ష..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్ లో జలదీక్ష చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులోగా పొట్టేపాలెం బ్రిడ్జి పై ప్రకటన రాకుంటే ఆందోళన చేపడతానని ప్రభుత్వానికి అల్టిమేట్టం ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొట్టేపాలెం కలుజువద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేక సార్లు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పెన్నా వరదల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి పొట్టే పాలెం కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణం అవసరమని గుర్తించారు . అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఉత్తర్వులు గాని నిధులు గాని మంజూరు కాకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. వరదల సమయంలో అయితే ఈ ప్రాంతంలో ప్రయాణిస్తూ అనేకమంది బైక్ ల పైనుంచి జారిపడి గాయాల పాలవుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి.
దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో పరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆందోళన బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఏప్రిల్ 1 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు జల దీక్షను నిర్వహించడానికి నిర్ణయించారు. పొట్టే పాలెం కలుజు వద్ద బ్రిడ్జి కోసం ఈ ప్రాంత ప్రజలు పడుతున్న బాధలను రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకువచ్చేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈ పంథా ఎంచుకున్నారు. ఈనెల 31 లోగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే జల దీక్ష పోరాటం సాగితీరుతుందని అంటున్నారు కోటంరెడ్డి.
కోటంరెడ్డి పోరాటాలు మొదల పెడితే, రూరల్ నియోజకవర్గంలో ఆయన మరింత బలపడటం ఖాయం. అదే సమయంలో ఇప్పటికిప్పుడు ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు. పోనీ హామీలిచ్చేసి చేతులు దులుపుకున్నా.. ఎన్నికలనాటికి పనులు పూర్తికాకపోతే కచ్చితంగా దాని ప్రభావం వైసీపీ విజయంపై ఉంటుంది. దీంతో అధిష్టానం నెల్లూరు రూరల్ సమస్యలపై వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. ఈ అపరిష్కృత సమస్యలే తనకు మరోసారి విజయాన్నిస్తాయని భావిస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.