నెల్లూరు గంజాయి ముఠాలో కిలేడీ- పోలీసులే షాకయ్యే కేసు ఇది!
నెల్లూరులో గంజాయి ముఠాలో కింగ్ పిన్ గా ఉన్న ఓ మహిళ ఉదంతం తెలిసి పోలీసులే షాకయ్యారు. ఆ మహిళ ఆధారంగా కేసుని ఛేదించారు.
నెల్లూరులో గంజాయి ముఠాలో కింగ్ పిన్ గా ఉన్న ఓ మహిళ ఉదంతం తెలిసి పోలీసులే షాకయ్యారు. ఆ మహిళ ఆధారంగా కేసుని ఛేదించారు. గంజాయి విక్రయాల్లో ముందున్న ఆ మహిళ పగడ్బందీగా ఈ దందా కొనసాగిస్తోంది. ఆమెను అరెస్ట్ చేసి, అనంతరం ఆ ముఠా వివరాలన్నీ రాబట్టారు నెల్లూరు జిల్లా పోలీసులు. మొత్తం ఆరుగురిన అరెస్టే చేశారు. 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 2 కార్లను సీజ్ చేశారు. మొత్తం ఆ సొత్తు విలువ 12.6 లక్షలుగా తేల్చారు. జిల్లాలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు పోలీసులు.
నెల్లూరు నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఎస్.కె. సుభాని అనే మహిళ ఆధారంగా ఈ కేసు మొత్తం బయటపడింది. ఆమె ద్వారా గంజాయి కొనుక్కున్న కొందరు, వాటిని తిరిగి విక్రయిస్తుండగా ఆ సమాచారం పోలీసులకు చేరింది. పోలీసులు నిఘా పెట్టి సుభానిని అరెస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన సమాచారంతో నెల్లూరు నగరంలోని వెంగళరావునగర్ లో ఉంటున్న సలీంను కూడా అదుపులోకి తీసుకున్నారు. సలీం స్థానికంగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సలీం తన కొడుకు సల్మాన్ తో కలసి గంజాయి అమ్ముతున్నాడు. సల్మాన్ ద్వారా చిన్న చిన్న పొట్లాలుగా గంజాయిని ప్యాక్ చేసి స్థానిక కాలేజీ విద్యార్థులకు అమ్ముతున్నట్టు తెలిసింది.
అప్పటి వరకు సుభాని, సలీం, సల్మాన్ ముగ్గురే పోలీసులకు చిక్కారు. వారి ద్వారా మరింత సమాచారం రాబట్టిన పోలీసులు.. నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ కారులో 10కిలోల గంజాయి పట్టుకున్నారు. ఆ కారులో ఉన్న షేక్ తాసీన్, వెంకటేశ్వర్లని అదుపులోకి తీసుకున్నారు.
వారిద్దరూ ఇచ్చిన సమాచారంతో మరో కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వెంకటేష్, మేనపాటి మురుగేష్ లను అరెస్టు చేశారు. వారి దగ్గర పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
తాసీన్ ద్వారా వ్యాపారం..
పట్టుబడిన వారిలో కీలక వ్యక్తి అయిన తాసీన్ విశాఖపట్టణం సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసేవాడు. కిలో గంజాయి రూ.10వేలకు కొనుగోలు జాగ్రత్తగా నెల్లూరు నగరానికి తరలించేవాడు. నదగరంలోని సలీం, పలమనేరుకి చెందిన మురుగన్, శివకు దాన్ని కిలో 15వేల రూపాయలకు విక్రయించేవాడు.
నెల్లూరు జిల్లాలో ఇలా..
నెల్లూరు జిల్లాలో దీన్ని కొన్న వ్యాపారులు నేరుగా విద్యార్థులకు అమ్మేవారు కాదు. దాన్ని రకరకాలుగా చేతులు మార్చి చివరకు విద్యార్థులకు చేరవేర్చేవారు. అయితే ఈ గొలుసుకట్టు వ్యాపారాన్ని పోలీసులు ఛేదించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు నిర్వహిస్తున్న కీలక వ్యక్తులను సెబ్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 12.60 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం చైన్ లింకులో ప్రధాన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు పోలీసులు. గంజాయి అక్రమ రవాణా.. విక్రయాలు జరుపుతున్న వారిపై రౌడీషీట్ తెరుస్తామన్నారు. ఈ దాడుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు బహుమతి అందజేశారు.