LVM3 M5: చరిత్ర సృష్టించిన ISRO.. బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్.. దీని ప్రయోజనాలు ఇవే
ISRO launches over 4000 kg communication satellite | ఎల్వీఎం-3 రాకెట్ చంద్రయాన్-3 ని విజయవంతంగా ప్రయోగించింది. 2023 లో చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ నిలిచింది.

ISRO News Today | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 4,000 కిలోల కంటే ఎక్కువ బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ని ఆదివారం (నవంబర్ 2)న ప్రయోగించింది. ఈ ఉపగ్రహం భారత్ భూస్థిర బదిలీ కక్ష్య (GTO)లోకి ప్రవేశపెట్టే అత్యంత భారీ ఉపగ్రహం అని అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది.
ఈ ఉపగ్రహాన్ని LVM3-M5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. దీని భారీ లిఫ్టింగ్ సామర్థ్యం కారణంగా దీనికి 'బాహుబలి' అని పేరు పెట్టారు. బెంగళూరులో ఉన్న అంతరిక్ష సంస్థ ఇస్రో శనివారం ప్రయోగ వాహనాన్ని పూర్తిగా సిద్ధం చేసి, అంతరిక్ష నౌకతో అనుసంధానం చేసి, ప్రయోగానికి ముందు చేసే పనుల కోసం రెండవ ప్రయోగ స్థలానికి తరలించింది.
బాహుబలి అని ఎందుకు పేరు పెట్టారు?
ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం 4,000 కిలోల వరకు బరువును మోసుకెళ్లే సామర్థ్యం కారణంగా శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌కు 'బాహుబలి' అని పేరు పెట్టారు. 43.5 మీటర్ల పొడవైన బహుబలి ఆదివారం సాయంత్రం 5 గంటల 26 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ మేరకు ఇస్రో చైర్మన్ నారాయణన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉపగ్రహాన్ని సైనిక నిఘా కోసం కూడా ఉపయోగించనున్నారు. భారత్ నుంచి స్వదేశీ రాకెట్ ద్వారా జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టిన వాటిలో ఇదే అత్యంత బరువైనది.
రెండు ఘన మోటార్లు 'స్ట్రాప్-ఆన్' (S200), ఒక ద్రవ ప్రోపెల్లెంట్ కోర్ దశ (L110), క్రయోజెనిక్ దశ (C25) కలిగిన ఈ 3-దశల ప్రయోగ వాహనం GTOలో 4,000 కిలోల వరకు బరువున్న భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించడంలో ఇస్రోకు పూర్తి స్వయం సమృద్ధిని అందిస్తుంది. LVM3ని ఇస్రో శాస్త్రవేత్తలు జియోసింక్రోనస్ ఉపగ్రహ ప్రయోగ వాహనం (GSLV) MK3 అని కూడా పిలుస్తారు.
Kudos Team #ISRO!
— Dr Jitendra Singh (@DrJitendraSingh) November 2, 2025
India’s #Bahubali scales the skies, with the successful launch of #LVM3M5 Mission!
“Bahubali” as it is being popularly referred, LVM3-M5 rocket is carrying the CMS-03 communication satellite, the heaviest ever to be launched from the Indian soil into a… pic.twitter.com/ccyIPUxpIX
ఇస్రో అత్యంత భారీ శాటిలైట్ ఏది?
అంతరిక్ష సంస్థ 5 డిసెంబర్ 2018న ఫ్రెంచ్ గయానాలోని కౌరూ ప్రయోగ కేంద్రం నుండి ఏరియన్-5 VA-246 రాకెట్ ద్వారా తన అత్యంత భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-11ని ప్రయోగించింది. దాదాపు 5,854 కిలోల బరువున్న GSAT-11 ఇస్రో తయారు చేసిన అత్యంత భారీ ఉపగ్రహం అది. ఆదివారం ప్రయోగంచిన ఈ మిషన్ లక్ష్యం ఏమిటంటే, మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 భారతీయ భూభాగంతో సహా విస్తారమైన సముద్ర ప్రాంతంలో సేవలను అందిస్తుందని ఇస్రో తెలిపింది.
LVM-3 రాకెట్ గతంలో చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా భారత్ 2023లో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర విజయవంతంగా దిగిన మొదటి దేశంగా అవతరించింది. LVM3 వాహనం దాని శక్తివంతమైన క్రయోజెనిక్ దశతో 4,000 కిలోల బరువున్న పేలోడ్‌ను GTOకి, 8,000 కిలోల బరువున్న పేలోడ్‌ను భూమి దిగువ కక్ష్యకు తీసుకెళ్లగలదు.






















