Nellore Lady Tea Master: విధిని ఎదిరించి, కుటుంబం కోసం టీ మాస్టర్‌గా మారిన మహిళ
Inspiring Story Of Nellore Woman: సహజంగా టీ షాపుల్లో మగవాళ్లు కనిపిస్తారు. ఆడవారు సహాయం చేస్తుంటారు. కానీ మహిళ అయిఉండి కూడా, మగతోడు లేకపోయినా ధైర్యంగా టీ షాపు నడుపుతోంది సుమతి.
Effects of COVID-19 on Families: కరోనా వైరస్ కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారు, కొంతమంది దిగాలుపడ్డారు, కుంగిపోయారు. మరి కొంతమంది ఏ పనిలోనూ కుదురుకోలేక అవస్థలు పడుతున్నారు. కానీ విధి తన భర్తను దూరం చేసినా, ఆ తర్వాత కరోనా వల్ల తన ఉపాధి పోయినా, ఆమె తట్టుకుని నిలబడ్డారు. జీవిత పోరాటంలో అడుగులువేస్తూ టీ మాస్టర్‌గా కొత్త జీవితం ప్రారంభించారు.
ఆమె పేరు పల్లవోలు సుమతి (Nellore Woman), నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని నారాయణరావు పేట ఆమె స్వస్థలం. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. తల్లిదండ్రులు, ఒక్కగానొక్క చెల్లెలి భారం కూడా ఆమెపైనే పడింది. ఇంత పెద్ద సంసారాన్ని నడపడానికి ఆమె హోటల్ లో పనికి కుదిరింది. కరోనా లాక్ డౌన్ వల్ల హోటళ్ల వ్యాపారం దెబ్బతినడంతో ఆమె ఉపాధి కోల్పోయింది. అక్కడితో ఆగిపోతే ఆమె సుమతి అయ్యేదే కాదు. లాక్ డౌన్ టైమ్ లో ఎక్కడా టీ కొట్లు కూడా ఉండేవి కాదు. దీంతో ఆమె ఇంటివద్ద టీ తయారు చేసుకుని ఫ్లాస్క్ లో పోసుకుని వీధి వీధి తిరుగుతూ విక్రయించేది. ఆ తర్వాత లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఓ టీ షాపులో పనికి కుదిరింది.
సహజంగా టీ షాపుల్లో మగవాళ్లు కనిపిస్తారు. ఆడవారు సహాయం చేస్తుంటారు. కానీ మహిళ అయిఉండి, ఇంట్లో తనకు పెద్ద తోడు లేకపోయినా ధైర్యంగా టీ షాపు నడుపుతోంది సుమతి. తాను చేసే పనిలో తనకెప్పుడూ ఇబ్బందులు ఎదురు కాలేదని చెబుతోంది. షాపులో టీ అమ్ముతూనే, మరోవైపు ఫ్లాస్క్ లో టీ తీసుకుని వీధి వీధి తిరుగుతూ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
ఆర్థికసాయం అందేనా..?
ప్రస్తుతం టీ షాపులో టీ మాస్టర్ గా పనిచేస్తున్న సుమతి, తన కాళ్లపై తాను నిలబడాలని అనుకుంటోంది. స్థానిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహాయాన్ని కోరేందుకు తెలిసినవారి ద్వారా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దాతలెవరైనా ఆమెకు ఆర్థిక సాయం చేస్తే తన కుటుంబాన్ని పోషించుకోగలనని అంటోంది సుమతి. చెల్లి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. పిల్లల్ని చదివించుకోవడంతోపాటు, తల్లిదండ్రుల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెపైనే ఉంది. అందుకే ఆమె విధిని ఎదిరించి నిలబడింది. కష్టాలున్నా కూడా ధైర్యంగా ముందడుగు వేసింది, మరో పదిమందికి ఆదర్శంగా నిలిచింది.
కాలం కలిసిరానప్పుడు చుట్టూ ఉన్న అవకాశాలేవీ మనకు కనిపించవు, వాటిలో ఏదో ఒకటి ఎంచుకుని జీవనం ముందుకు సాగిస్తేనే భవిష్యత్తులో మనం అంటూ ఉండగలం. కరోనా వల్ల చాలామంది ఉపాధి కోల్పోయినా.. కొత్త ఆలోచనతో ఇలా నిలబడగలిగినవారే అసలైన విజేతలు. అలాంటి విజేతల్లో సుమతి కూడా ఒకరు.
Also Read: Red Sandalwood Smugglers: ఎర్రచందనం కూలీలను పోలీసుల కళ్లుగప్పి డ్రైవర్, కండక్టర్ ఎలా తప్పించారంటే !
Also Read: Weather Updates Today: హీటెక్కుతున్న ఏపీ, కొన్ని జిల్లాల్లో వర్షాలతో కూల్ కూల్‌గా తెలంగాణ