YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
AP Rains News: సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో.. సోమవారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
Cyclone Michaung: మిచౌంగ్ తుపాను నేపథ్యంలో సీఎం జగన్( ys jagan) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో 8 జిల్లాలపై తుపాను(cyclone) తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న హెచ్చరికలతో ఆయా జిల్లాల కలెక్టర్లు(collectors) అప్రమత్తంగా ఉండాలని సూచించారు జగన్. సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర సాయం కింద నిధులు విడుదల చేశారు. తిరుపతి జిల్లాకు ప్రత్యేక సాయంగా రూ.2కోట్లు విడుదల చేశారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకు.. ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేశారు.
వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం జగన్. విద్యుత్, రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా రవాణాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని, అక్కడ సరైన వసతులు కల్పించాలన్నారు. పునరావాస శిబిరాల్లో బాధితుల కోసం తాగునీరు, ఆహారం, పాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుపాను సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు తుపాను ప్రభావం జిల్లాపై ఉంటుందన్నారు కలెక్టర్. 3వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రభావం పెరుగుతుందని, 4వ తేదీ సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేలా రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పంచాయితీ రాజ్, పౌర సరఫరాలు, తదితర విభాగాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 1077 కాల్ సెంటర్ 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని నియమించామని వివరించారు. సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో.. సోమవారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ హరి నారాయణన్.
నెల్లూరు జిల్లాకు సముద్రతీరంతోపాటు కండలేరు, సోమశిల రెండు ప్రధాన జలాశయాలున్నాయి. ఈనెల 3 నుండి 5వరేదీ వరకు సముద్ర తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలిచ్చారు. పెన్నాపరివాహక మత్స్యకారులను కూడా అప్రమత్తం చేశారు. సోమశిల, కండలేరు ప్రధాన జలాశయాల్లోకి ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
ఇక దక్షిణ మధ్య రైల్వే కూడా తుపాను ప్రభావంతే పలు రైళ్లను రద్దు చేసింది. 140కి పైగా రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు ప్రకటించారు. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు అధికారులు. భారీ వర్షాలకు ఇతర ప్రైవేటు వాహనాల సౌకర్యం కూడా తక్కువగా ఉండే అవకాశముంది. తుపాను సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం వాయుగుండం కారణంగా కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారానికి ఇది తుపానుగా బలపడుతుందని అంచనా. తుపాను ప్రభావంతో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఈనెల 4వతేదీ సోమవారం నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో తుపాను తీరందాటుతుందని చెబుతున్నారు. తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారంతో తుపాను ప్రభావం తగ్గిపోయే అవకాశముంది.