Bio Ethanol Plant Nellore : నెల్లూరులో బయో ఇథనాల్ ప్లాంట్ - సీఎంను ఒప్పించి సాధించిన మంత్రి కాకాణి
నెల్లూరు జిల్లాకు బయో ఇథనాల్ ప్లాంట్ కేటాయించారు సీఎం జగన్. రూ. 560కోట్లతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సర్వేపల్లిలో కృషక్ భారతి కో ఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈప్లాంట్ ఏర్పాటు చేస్తారు.
నెల్లూరు జిల్లాకు బయో ఇథనాల్ ప్లాంట్ కేటాయించారు సీఎం జగన్. రూ. 560కోట్లతో దీన్ని నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. సర్వేపల్లిలో కృషక్ భారతి కో ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్కో) ఆధ్వర్యంలో ఈప్లాంట్ ఏర్పాటు చేస్తారు. రెండు విడతల్లో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.560 కోట్ల వ్యయంతో 250 కె.ఎల్.డి. సామర్థ్యంతో దీన్ని నిర్మించబోతున్నారు.
నూతన బయో ఇథనాల్ ప్లాంట్ ను 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం జగన్. దీని ద్వారా 400 మందికి ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిపారు. ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ పాలసీలో మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు సీఎం జగన్. ఎగుమతులను 5 ఏళ్లలో రెట్టింపు చేస్తామని చెప్పారు. ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్ల ఎగుమతులు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు.
వ్యవసాయ మంత్రి నియోజకవర్గంలో..
రెండో విడతలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో ఈ బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు కానుండటం విశేషం. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ధర్మాన, ఆదిమూలపు సురేష్, కాకాణి, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్, రోజా పాల్గొన్నారు.
ఆక్వా ఉత్పత్తులు పెంచేందుకు..
ఏపీనుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో అధిక భాగం ఆక్వా ఉత్పత్తులే ఉన్నాయి. వీటి క్వాలిటీ పెంచితే ఎగుమతులు మరింత పెరిగే అవకాశముంది. దీనికి తగినట్టు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగిల్ డెస్క్ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల విధానంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు జగన్.
ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ తీసుకున్న నిర్ణయాలివే..
- నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ ప్లాంట్...
- విత్తన శుద్ధి, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకి చర్యలు..
- ఎగుమతులు ప్రోత్సహించే దిశగా ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022–27 రూపకల్పన.
- 5 ఏళ్లలో ఎగుమతులు రెట్టింపు చేసేందుకు చర్యలు
- విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు
నెల్లూరు జిల్లాలో సంబరాలు..
నెల్లూరు జిల్లాకు బయో ఇథనాల్ ప్లాంట్ కేటాయించడంతో జిల్లాలో, ముఖ్యంగా మంత్రి కాకాణి నియోజకవర్గం సర్వేపల్లిలో నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, జగన్ హయాంలో తమ ప్రాంతానికి ఫ్యాక్టరీ రావడం సంతోషంగా ఉందని అన్నారు. మంత్రి కాకాణికి కృతజ్ఞతలు తెలిపారు.