Nellore - Tirupati Districts: నెల్లూరు - తిరుపతి అధికారుల విభజన ఎలా జరిగిందంటే..
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కొత్త జిల్లాలకు సీనియర్లను, పాత జిల్లాలకు కొత్తవారిని నియమిస్తారని అనుకున్నా.. అలా జరగలేదు.
Nellore - Tirupati Districts: ఏపీలో కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కొత్త జిల్లాల (AP New Districts Raised To 26)కు సీనియర్లను, పాత జిల్లాలకు కొత్తవారిని నియమిస్తారని అనుకున్నా.. ఆ ఫార్ములాని ప్రభుత్వం మార్చేసింది. కొత్త జిల్లాలకు కొత్తవారిని నియమించింది. పాత జిల్లాల్లో పాతవారినే ఉంచింది. 13 జిల్లాల్లో 9మందికి స్థాన చలనం లేదు. ఆ 9 జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. నెల్లూరు జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ అలాగే ఉన్నారు. చక్రధర్ బాబుని తిరుపతి కేంద్రంగా ఏర్పడే నూతన జిల్లాకు మారుస్తారని అనుకున్నా రాష్ట్రవ్యాప్తంగా అలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆయన్ను నెల్లూరుకే కొనసాగించారు.
నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు..
తిరుపతి జిల్లాకు కె.వెంకట్రామిరెడ్డి కలెక్టర్ కాగా, డీకే బాలాజీని జాయింట్ కలెక్టర్ గా నియమించారు. సీఎం సీఎస్వోగా ఉన్న పరమేశ్వర్ రెడ్డిని తిరుపతి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలనుంచి వేరు చేసిన నియోజకవర్గాలతో ఏర్పడిన కొత్త జిల్లాకు తొలుత బాలాజీ జిల్లా అని పేరు పెట్టాలని అనుకున్నా.. ఆ పదం పూర్తిగా ఉత్తరాది పదంగా ఉంటుందని, తిరుపతి కేంద్రంగా జిల్లా ఏర్పడుతుంది కాబట్టి తిరుపతి జిల్లా అని పెట్టాలనే డిమాండ్ వినిపించింది. ఆ డిమాండ్ ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాకు తిరుపతి అనే పేరుని పెట్టింది.
నెల్లూరు నగర కమిషనర్ గా ఉన్న దినేష్ కుమార్ ను సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్న జాహ్నవి కమిషనర్ గా బదిలీ అయ్యారు. 2018 బ్యాచ్ ఐఏఎస్ అయిన జాహ్నవి ఇటీవలే బదిలీపై నెల్లూరు జిల్లా హౌసింగ్ జేసీగా వచ్చారు. ఆమె తక్కువ కాల వ్యవధిలోనే ఇలా నగర కమిషనర్ గా వస్తున్నారు.
అధికారుల పంపకం ఇలా..
నెల్లూరు - తిరుపతి జిల్లాల విభజన, అధికారుల పంపకం పక్కాగా పూర్తయింది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ అధికారుల్ని ఎక్కడికీ పంపించకుండా అలాగే ఉంచారు. అదే సమయంలో తిరుపతికి కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిని కలెక్టర్ గా నియమించారు. ఆయన 2013 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి.
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్లో కేవలం నాలుగు జిల్లాల కలెక్టర్లను మాత్రమే ప్రభుత్వం బదిలీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ని సీఆర్‌డీఏ కమిషనర్ గా బదిలీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ ను వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ గా నియమించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ ను వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ గా నియమించారు. రవాణాశాఖ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ బదిలీ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా చక్రవర్తి, యువజన వ్యవహారాలు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా ని జి.వాణీమోహన్ ను బదిలీ చేశారు.
Also Read: AP New Districts: ఏపీలో 26 జిల్లాలపై తుది నోటిఫికేషన్ విడుదల - జిల్లాల సమగ్ర వివరాలు ఇవే
Also Read: New Districts In AP: కొత్త జిల్లాల ఏర్పాటులో మరో ముందడుగు- కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం