Anilkumar: వైసీపీ టికెట్ రాకపోయినా ఓకే, సీఎం జగన్ గెటౌట్ అన్నా నేను ఆయన వెంటే!
ఆ ముగ్గురిలో ఒక్కరు గెలిచినా తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని, నెల్లూరు జిల్లాకు శాశ్వతంగా దూరమైపోతానని అన్నారు. దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని బాండ్ పేపర్ పై రాసుకోవడానికి తాను సిద్ధం అని చెప్పారు.
సింగిల్ డిజిట్ మెజార్టీ అనిల్ అంటూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన కామెంట్లు... నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కు కాస్త ఘాటుగానే తగిలినట్టున్నాయి. అందుకే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. తనది సింగిల్ డిజిట్టేనని ఒప్పుకుంటున్నానని, వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి ఎంత మెజార్టీ వస్తుందో చూస్తామంటూ సవాల్ విసిరారు. ఆయనకు అసలు టీడీపీ టికెట్టు కూడా ఇవ్వదని ఎద్దేవా చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే చంద్రశేఖర్ రెడ్డికి ఏం జరుగుతుందో తెలుసన్నారు.
నాకు టికెట్ రాకపోయినా పర్లేదు..
వచ్చే ఎన్నికల్లో తనకు జగన్ టికెట్ ఇవ్వరంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూడా అనిల్ కౌంటర్ ఇచ్చారు. తనకు సీఎం జగన్ టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం వైసీపూనుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా సీఎం ఫొటోతో గెలిచినవారేనని, ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. నెల్లూరు సిటీలో తనను కాదని ఏ,బీ,సీ,.. ఇలా ఎవరిని ఓకే చేసినా తనకేమీ ఇబ్బంది లేదని, వారి గెలుపుకోసం సామాన్య కార్యకర్తలాగా కృషి చేస్తానన్నారు. తనకు టికెట్ రాకపోతే తానేమీ ఫీలవ్వనని, జగన్ తనను గెటౌట్ అన్నా కూడా తన ఇంట్లో ఆయన ఫొటో ఉంటుందని చెప్పారు అనిల్.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఏ పార్టీలోనూ టికెట్ వచ్చే పరిస్థితి లేదన్నారు అనిల్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేశానని అంటున్న చంద్రశేఖర్ రెడ్డి అంతరాత్మకు అంతా తెలుసన్నారు. తన నోరు ఎప్పుడూ ఆగదని, తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తూనే ఉంటానని, జగన్ కోసం మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు అనిల్.
బాండ్ పేపర్ రాసుకుందామా..?
పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముగ్గురిలో ఒక్కరు శాసనసభకు వచ్చినా జీవితంలో తాను రాజకీయాల్లో ఉండనని సవాల్ విసిరారు అనిల్. ఆ ముగ్గురిలో ఒక్కరు గెలిచినా.. తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని, నెల్లూరు జిల్లాకు శాశ్వతంగా దూరమైపోతానని అన్నారు. దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని, బాండ్ పేపర్ పై రాసుకోవడానికి తాను సిద్ధం అని చెప్పారు. ఆ ముగ్గురిలో ఆనంకు టీడీపీ టికెట్ ఇస్తారేమో కానీ, కోటంరెడ్డికి నెల్లూరు రూరల్ లో గట్టి పోటీ ఉందని, చంద్రశేఖర్ రెడ్డికి అసలు టీడీపీ టికెట్ ఇవ్వదని ఘంటాపథంగా చెప్పారు అనిల్.
అనిల్ వ్యాఖ్యలు మరోసారి జిల్లాలో సంచలనంగా మారాయి. జిల్లాలో గతంలో టీడీపీ వైసీపీ కూడా ఎప్పుడూ ఇంత ఇదిగా తిట్టుకోలేదు. ఇప్పుడు వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఒకే పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు, నిన్న మొన్నటి వరకు కలసి కార్యక్రమాలు చేసిన నేతలు, ఇప్పుడిలా బహిరంగ సవాళ్లు విసురుకుంటున్నారు. నీకు టికెట్ రాదు అంటే, నువ్వు గెలవలేవు అంటూ శాపనార్థాలు పెట్టుకుంటున్నారు. టీడీపీ కూడా ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉంది. వైసీపీని వైసీపీ నేతలే తిట్టుకుంటున్నారంటూ తమాషా చూస్తోంది. రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. నెల్లూరులో మాత్రం సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మిగతా నేతలకు చుక్కలు చూపెడుతున్నారు. ఆ ముగ్గురిపై అనిల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.