Atchannaidu About Jagan: వివేకా హత్యకేసు డైవర్షన్ కోసమే జగన్ విశాఖ పేరెత్తారు - అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
సరిగ్గా వైఎస్ వివేకా హత్యకేసు గురించి ఏపీలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతున్న ఈ సమయంలో జగన్.. సెప్టెంబర్ మాసం అంటూ హింటివ్వడం మాత్రం విశేషం. అందుకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండిపడుతోంది.
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ రాజధాని వ్యవహారం గురించి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ పాలనా రాజధాని అవుతుందన్నారు. అక్కడినుంచే పాలన మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రకటన ఎందుకు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు కాబట్టే ఉత్తరాంధ్ర పాలనా రాజధానికి కేంద్ర అవుతుందని చెప్పారా, లేక కారణం ఇంకేదయినా ఉందా..? టీడీపీ మాత్రం జగన్ పై మండిపడుతోంది. ప్రస్తుతం ఏపీలో వైఎస్ వివేకా హత్యకేసు విచారణ హాట్ టాపిక్ గా ఉందని, దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే జగన్ ఇలా మాట్లాడారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే కొత్తగా విశాఖ నుంచి పాలన అనే విషయాన్ని తెరపైకి తెచ్చారన్నారు. అసలు కోర్టులో కేసు ఉండగా.. జగన్ విశాఖకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని, ఎప్పుడైనా అది పడిపోవచ్చని, ఏపీలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని చెప్పారు అచ్చెన్నాయుడు. నెల్లూరు నగరంలో జరిగిన బీసీ ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా అచ్చెన్నాయుడు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు.
వాస్తవానికి విశాఖ పాలనా రాజధాని విషయంలో జగన్ ఇప్పటికే చాలా డెడ్ లైన్లు పెట్టారు, అన్నీ దాటిపోయాయి. కోర్టులో కేసు ఉండగా జగన్ ఇలాంటి సాహసం చేయరని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆయన రాజధానిపై ప్రకటన చేశారు. డేట్ ఫిక్స్ చేయలేదు కానీ, సెప్టెంబర్ అంటూ హింట్ ఇచ్చారు. అంటే సెప్టెంబర్ నాటికి అక్కడ నిర్మాణాలు పూర్తవుతాయా..? లేక ఇంకేదయినా మహూర్తం ఉందా అనేది మాత్రం తేలలేదు.
ఈసారి నమ్మవచ్చా..?
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల గురించి ప్రకటించారు. మండలిలో బిల్లు తిరస్కరణకు గురి కావడం, కోర్టు కేసులు, అమరావతి రైతుల యాత్రలతో అది అప్పటికప్పుడు సాధ్యం కాలేదు. కానీ జగన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తూనే ఉన్నారు. విశాఖలోని రుషికొండలో రాజధానికోసం భవనాలు నిర్మిస్తున్నారు. త్వరలోనే అక్కడికి పూర్తి సరంజామాతో వెళ్తారని అంటున్నారు. కానీ ఎన్నికల ఏడాదిలోగా అది సాధ్యమయ్యేట్టు కనిపించలేదు. ఆ మధ్య విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ తో పాలనా రాజధానికి ఓ ఊపు వచ్చింది. ఆ తర్వాత కూడా జగన్ క్లారిటీగా ప్రకటన చేయలేదు. 2023-24 విద్యా సంవత్సరానికి అంతా సెట్ అవుతుందనుకున్నా.. జగన్ ఎటూ కాకుండా సెప్టెంబర్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఆ టైమ్ కి సచివాలయ ఉద్యోగులంతా కుటుంబాలతో సహా విశాఖకు షిప్ట్ అవ్వాల్సిందే. లేదంటా మరోసారి విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారం వాయిదా పడొచ్చు.
ఏపీ సీఎం జగన్ ఆలోచన ఎలా ఉన్నా.. సరిగ్గా వైఎస్ వివేకా హత్యకేసు గురించి ఏపీలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతున్న ఈ సమయంలో ఆయన సెప్టెంబర్ మాసం అంటూ హింటివ్వడం మాత్రం విశేషం. అందుకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండిపడుతోంది.