Aadhar Problems For Tribal: అందరికీ ఆధార్ వరం.. వారికి మాత్రం శాపం..
సంచార జాతుల్లో సగటున 50 శాతం మంది గిరిజనులకు ఆధార్ కార్డ్ అంటే ఏంటే తెలియదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో నివశించే గిరిజనులు కూడా ఆధార్ సౌకర్యానికి దూరంగా ఉంటున్నారు.
అందరికీ ఆధార్ ఓ వరం. ఆధార్ కార్డ్ తో అన్ని పథకాలు అందిపుచ్చుకోవచ్చు. కానీ గిరిజనులకు మాత్రం అది ఇంకా ఓ శాపంగా మారింది. సంచార జాతుల్లో సగటున 50 శాతం మంది గిరిజనులకు ఆధార్ కార్డ్ అంటే ఏంటే తెలియదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో నివశించే గిరిజనులు కూడా ఆధార్ సౌకర్యానికి దూరంగా ఉంటున్నారు. చిన్నపిల్లల్ని స్కూల్‌లో వేయాలంటే ఆధార్ తప్పనిసరి, రేషన్ కార్డ్ కావాలంటే ఆధార్ ఉండాలి, అనుకోని ప్రమాదం జరిగితే ఆరోగ్యశ్రీ కింద చికిత్సకి కూడా ఆధారే కీలకం. కానీ ఆధార్ గురించి, పథకాల గురించి సరైన అవగాహన లేక గిరిజనులు వీటన్నిటికీ దూరమైపోయారు.
కూలీ పనులకు వెళ్లేవారు, నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా చేపల చెరువుల వద్ద పనులకు వెళ్లే గిరిజనులు ఏదైనా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే.. కనీసం ప్రభుత్వ బీమా సొమ్ము కూడా వారికి రాదు. ఎందుకంటే వారికి ఆధార్ ఉండదు, అసంఘటిత రంగంలోని కార్మికులకు ఇచ్చే బీమాకు వారు అర్హులు కారు. ఇలాంటి కష్టనష్టాలను చూసి నెల్లూరు జిల్లా అధికారులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. కేవలం గిరిజనుల కోసమే నెల్లూరు నగరంలో ఓ ఆధార్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఎలాంటి పత్రాలు లేకపోయినా, వారివద్ద వివరాలు సరిగా ఉంటే.. అక్కడికక్కడే ఆధార్ నమోదు చేసుకుంటారు.
గిరిజనులు, సంచార జాతుల వారికి ఆధార్ కష్టాలు లేకుండా చేసేందుకు ఐటీడీఏ పీవో కనకదుర్గా భవాని తమ కార్యాలయం ఆవరణలో గిరిజనుల కోసం శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభించారు. ఈ ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ సౌకర్యాన్ని జిల్లాలోని గిరిజనులు బాగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారామె.
నెల్లూరు జిల్లాలో గిరిజనుల్లో ఆధార్ కార్డులు లేనివారు. ఆధార్ ఉన్నప్పటికీ బయోమెట్రిక్ అబ్జక్షన్లు ఉన్నవారు.. ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ని వినియోగించుకోవాలని సూచించారామె. ఆధార్ లేకుండా ఎవరూ ఉండకూడదని, సంక్షేమ పథకాలకు ఎవరూ దూరం కాకూడదనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
శాశ్వత ఆధార్ కేంద్రంతోపాటు.. సంచార ఆధార్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారామె. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 5 మొబైల్ ఆధార్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. టీపీ గూడూరు మండలంలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు, మంచి ఫలితాలు సాధించారు. ఇప్పటి వరకూ 1400మందికిపైగా ఆధార్ లు అందించారు. వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా చేయడం సంతోషాన్నిచ్చిందని చెబుతారామె.
ప్రపంచం ముందుకు వెళ్తోందని, సాంకేతికతని అందిపుచ్చుకుంటున్నామని మనమందరం అనుకుంటాం. కానీ ఇప్పటికీ ఆధార్ అంటే ఏంటో తెలియని గిరిజనులు, ఆధార్ కార్డ్ ప్రయోజనం పొందలేనివారు, తద్వారా ప్రభుత్వ పథకాలకు ఆమడదూరంలో ఉన్నవారు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటారు. ఇలాంటి వారి కోసం నెల్లూరు జిల్లా అధికారులు చేపట్టిన ఈ ప్రయోగం అభినందనీయం.
Also Read: రాఘవకు సహకరిస్తున్న రాజకీయ నాయకులెవ్వరు..?
Also Read: వ్యాయామం చేస్తుండగా మందలించిన తల్లి... కోపంతో తల్లిని హత్య చేసిన కొడుకు... అడ్డొచ్చిన చెల్లిపై దాడి