Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Srikakulam News: ధర్మాన కృష్ణదాస్ పీఏ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది. ఆయన ధర్మాన కృష్ణదాసుకు బినామీ అని ఆరోపణలు వస్తున్నాయి.
ACB Dharmana Krishnadas PA: వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణదాస్ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పీఏగా మురళి పని చేశారు. మురళికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు నేపథ్యంలో ఈ దాడులు జరుపుతున్నారు. కోటబొమ్మాళి మండలం దంత గ్రామంతో పాటు, లింగనాయుడిపేట, విశాఖపట్నంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆయన మాతృశాఖకు వెళ్లారు.
మురళీ ధర్మాన కృష్ణదాసుకు బినామీ అన్న ఆరోపణలు
ధర్మాన కృష్ణదాసుకు ఆయన బినామీ అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన మొదట మూడేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో మురళి ఆయనకు పీఏ. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. వసూళ్లు చేసి బినామీ ఆస్తులు కూడబెట్టారని గుసగుసలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో అన్ని వివరాలు సేకరించి పలు చోట్ల ఒకే సారి సోదాలు నిర్వహించారు. ఆదాయనికి మించి ఉన్న ఆస్తులపై ముందుగానే స్పష్టమైన సమాచారం ఉండటంతో మరిన్ని అదనపు ఆస్తుల కోసం సోదాలు జరుపుతున్నారని చెబుతున్నారు.
Also Read: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
సోదాపు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం
విశాఖలోనూ సోదాలు నిర్వహిస్తున్నందున పూర్తి వివరాలను సోదాలు వెల్లడయిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. సోదాలు అటు అధికార వర్గాలతో పాటు ఇటు రాజకీయవర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయి. ఈ సోదాలపై వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఆయన సాధారణ ఉద్యోగి మాత్రమేనని కృష్ణదాస్ వద్ద పీఏగా పని చేసినంత మాత్రాన ఆయనతో లింక్ పెట్టడం సరి కాదని వైసీపీ వర్గాలంటున్నాయి. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ చేసి చర్యలు తీసుకోవచ్చని సలహాలిస్తున్నారు.
Also Read: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
మాజీ పీఏ ఇంట్లో దాడులపై స్పందించని ధర్మాన కృష్ణదాసు
ధర్మాన కృష్ణదాసు ఇటీవలి కాలంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంత యాక్టివ్ గా లేరు. పార్టీ తరపున పెద్దగా కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదు. రాష్ట్ర స్థాయిలో పార్టీ ఎలాంటి కార్యక్రమాలకూ పిలుపునివ్వకపోవడంతో వైసీపీ పరిస్థిని నిశ్శబ్దంగా ఉంది. పలువురు వైసీపీ నేతలపై అవినీతి కేసులు నమోదవుతూండటంతో.. ధర్మాన కృష్ణదాసును కూడా ఇలా టార్గెట్ చేశారేమోనని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.