Nellore News : రాజకీయ నాయకులు వ్యాపారాలు చేస్తే తప్పా? టీడీపీపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫైర్
Nellore News : రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయకూడదా? కాంట్రాక్ట్ వర్క్ లు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. టీడీపీ నేతలు చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
Nellore News : రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయకూడదా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోకూడదా అని ప్రశ్నించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తనపై నెల్లూరు టీడీపీ నేతలు చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. దేవుడి దగ్గర ప్రమాణాలకు పిలుస్తున్నారని, అసలు ప్రమాణాలు చేసే అర్హత రాజకీయ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. అందరూ శాకాహారులే కానీ, బుట్టలో రొయ్యల కూర మాత్రం మాయమైంది అన్నట్టుగా రాజకీయ నాయకుల వ్యవహారం ఉంటుందని అన్నారు శ్రీధర్ రెడ్డి. సబ్ కాంట్రాక్ట్ లు తీసుకోవడం తప్పా అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అన్యాయమా అని నిలదీశారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో తాను కార్యకర్తలకు వ్యక్తిగతంగా సాయపడ్డానని చెప్పారు. వ్యాపారం చేయడం తప్పు కాదని, రాజకీయ దోపిడీకి పాల్పడటం తప్పు అని అన్నారు శ్రీధర్ రెడ్డి.
వ్యాపారాలు చేస్తే తప్పేంటి?
నెల్లూరు రూరల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తనకు భాగస్వామ్యం ఉందని, నెల్లూరు రూరల్ మాత్రమే కాదు సూళ్లూరుపేట, తిరుపతి, చెన్నై, బెంగుళూరులో కూడా తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయని చెప్పారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వ్యాపారాలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. వ్యాపారస్తులని బెదిరిస్తే తప్పు అని అన్నారు. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్టు పనులు చేస్తున్నామని చెప్పారు.
చందాలు వసూళ్లు
బాదుడే బాదుడు అని రక్తం వచ్చేలా నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కొంతమంది వ్యాపారులను చందాల పేరుతో పీడిస్తున్నారని చెప్పారు. వారంతా తన వద్దకు వచ్చి బాధపడ్డారని, వ్యాపారుల వద్ద చందాలు తీసుకుని రాజకీయం చేయడం తప్పుకాదని, కానీ మరీ పీడించుకు తింటున్నారని ఆరోపించారు.
అమ్ముకోడానికి ఆస్తులు లేవు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 1072 మంది పార్టీ కార్యకర్తలకు తాను వ్యక్తిగతంగా సాయం చేశానన్నారు శ్రీధర్ రెడ్డి. ఇంకా 1000 మందికి సాయం చేస్తానని చెప్పారు. 413 మంది చిన్నారులకు ఉచిత విద్య అందిస్తున్నానని, ఇద్దరు విద్యార్థులకు ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ ఇప్పిస్తున్నానని చెప్పారు. రాజకీయాలకోసం ఆస్తులు అమ్ముకున్నా, అప్పులు చేశానని తానెప్పుడూ చెప్పలేదని, అమ్ముకోడానికి తమ వద్ద ఆస్తులు కూడా లేవన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయకూడదని సైలెంట్ గా ఉన్నానని, తాను నోరుతెరిస్తే చాలా విషయాలు బయటపెడుతాయన్నారు.
చేతక్ శ్రీధర్ రెడ్డి
చేతక్ మీద తిరిగే శ్రీధర్ రెడ్డి తెలుసు అని కొంతమంది విమర్శిస్తున్నారని, తాను చేతక్ స్కూటర్ కంటే ముందు సైకిల్ తొక్కేవాడినని, ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇకపై తనను విమర్శించాలనుకునేవారు ఎవరైనా సైకిల్ పై తిరిగిన శ్రీధర్ రెడ్డి, ఇప్పుడెలా ఉన్నాడో చూడండి అంటూ విమర్శలు చేసుకోవచ్చని చెప్పారు. తాను లగ్జరీ కారు కూడా వాడనని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తీసుకున్న కారుని, ఇప్పటి వరకూ మార్చలేదని చెప్పారు శ్రీధర్ రెడ్డి.