National Herald Case : బ్యాంకులు లూటీ చేసిన వాళ్లంతా బీజేపీలోనే-ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
National Herald Case Congress Protest : సోనియా, రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వం పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగాయి.
National Herald Case Congress Protest : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీచేసింది. రాహుల్ గాంధీ సోమవారం ఈడీ విచారణ హాజరయ్యారు. ఇవాళ కూడా ఈడీ రాహుల్ ను విచారణ చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కుట్రతోనే సోనియా, రాహుల్ గాంధీని ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ కాంగ్రెస్ శ్రేణులు ఈడీ కార్యాలయాల ముందు కూర్చుని నిరసన తెలుపుతున్నాయి.
అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి-శైలజానాథ్
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నిందలు మోపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకె శైలజనాథ్ ఆరోపించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీలపై ఎఫ్ఐఆర్ కూడా లేకుండా విచారణ జరిపేలా మోదీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అప్రజాస్వామికమైన, అనైతికమైన విధానాలతో చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ దుర్మార్గమైన చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శైలజనాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే వెనక్కి తీసుకుని బీజేపీ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన రాహుల్ గాంధీ మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ దేశానికి రక్ష అని శైలజనాథ్ పేర్కొన్నారు. రెండో రోజూ విచారణ జరపడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
బ్యాంకుల లూటీ చేసిన వాళ్లంతా బీజేపీలోనే - జగ్గారెడ్డి
ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లో బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. అందుకే ఈడీ కేసుల ప్రయోగం చేసిందన్నారు. కరోనా మహమ్మారి రానుందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ లో సోనియా రాహుల్ గాంధీలు సూచించారని గుర్తుచేశారు. నెహ్రూ 16 ఏళ్లు, ఇందిరా గాంధీ 6 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారన్నారు. దేశం కోసం గాంధీలు కుటుంబాన్నే త్యాగం చేశారన్నారు. మరి బీజేపీలో దేశం కోసం ఒక్కరైనా త్యాగం చేసినవారు ఉన్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్లకు వత్తాసు పలికిందన్నారు. గాంధీని చంపిన గాడ్సేని బీజేపీ పార్లమెంట్ లో గొప్పవాడు అంటున్నారని ఆరోపించారు. బ్యాంకులు లూటీ చేసిన నేతలంతా బీజేపీలోనే ఉన్నారని, వారి మీద ఈడీ చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబానికి తామంతా అండగా ఉంటామన్నారు.
,