Nara Lokesh Padayatra: కడప జిల్లా లోకేష్ పాదయాత్రలో టెన్షన్ టెన్షన్- గురవారం పలుచోట్ల ఉద్రిక్తత
Nara Lokesh Padayatra: కడప జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర చాలా హాట్‌హాట్‌గా సాగుతోంది. పోలీసులు, వైసీపీ లీడర్లు అడ్డతగులుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ లీడర్లు మండిపడుతున్నారు
Nara Lokesh Padayatra: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో గురువారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. మొదట ప్లకార్డులు ప్రదర్శించ వద్దని పోలీసులు చెప్పడంతో లోకేష్ వారిపై ఫైర్ అయ్యారు. అది సద్దుమణిగిందని అనేసరికి గుర్తు తెలియని వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. పోలీసులు నచ్చజెప్పడంతో లోకేష్, టీడీపీ శ్రేణులు శాంతించాయి.
పోలీసుల సహకారంతో లోకేష్ పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇది ప్రభుత్వ భద్రతా వైఫల్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి చెబుతున్నారు. 113 రోజులుగా జరుగుతున్న యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ముఖ్యమంత్రి జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.
గురువారం జమ్మలమడుగులో, ప్రొద్దుటూరు పట్టణంలో లోకేష్ యువగళం పాదయాత్రకు లభించిన అపూర్వ స్పందనను చూసి.. వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిసిపోయాయని ఆర్ శ్రీనివాసులు విమర్శించారు. అందుకే ఆకతాయి పనులు చేస్తున్నారన్నారు. రాజారెడ్డి, ఇబ్రహీం అనే ఇన్స్పెక్టర్ల సమక్షంలోనే కోడిగుడ్లు విసరడం జరిగిందిన్నారు. సీఎం ఫ్రస్ట్రేషన్ తోనే చేయిస్తున్నట్లు తెలుస్తోందంటూ కామెంట్లు చేసారు. సీఎం సొంత జిల్లాలో లోకేష్ పర్యటిస్తుండడం తట్టుకోలేకే.. ఇలా చేయించారంటూ ఆరోపించారు.
లోకేష్ పాదయాత్రకు మూడు రోజులు ముందు నుంచి పోలీసు యంత్రాంగాన్ని తాము అలెర్ట్ చేస్తున్నా.. వారు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని ఆర్ శ్రీనివాసులు వివరించారు. ఈక్రమంలోనే పోలీసులు వైఫల్యం చెందినట్టు తెలిపారు. పాదయాత్రకు అనుమతి ఉన్నా అడ్డంకులు సృష్టించారని.. టీడీపీ నాయకులు ఫ్లెక్సీలకు అనుమతులున్నా వైసీపీ నాయకులు అడ్డంగా ఫ్లెక్సీలు కట్టారన్నారు. 14సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబుపై వ్యంగంగా ఫ్లెక్సీలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ కూర్చోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మున్సిపల్ అధికారులు, పోలీసులు, జిల్లా ఎస్పీలు దీనిపై బాధ్యత వహించాలన్నారు శ్రీనివాసుల రెడ్డి. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం భావ్యం కాదని.. అధికారం శాశ్వతం కాదని వైసీపీ నాయకులు గ్రహించాలన్నారు. వైసీపీ నాయకులు త్వరలో మాజీలు అవుతారనే విషయాన్ని స్థానిక వైసీపీ నాయకులు మరచినట్లున్నారంటూ విమర్శలు చేశారు. కోడిగడ్లు విసురుతుంటే.. తెలుగు సైన్యం చేతులు కట్టుకొని కూర్చోదని.. భద్రతా వైఫల్యానికి కారకులైన డీజీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పారు. కోడిగుడ్లు విసిరిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు కట్టినవారిపై, బాధ్యులైన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని శ్రీవాసులు డిమాండ్ చేశారు.
బాబు బాంబులకే భయపడలేదు.. ఆయన కొడుకు గుడ్లకు భయపడతాడా?
అలిపిరిలో బాంబులకే టీడీపీ అధినేత చంద్రబాబు భయపడలేదని.. మీ అల్లరి మూకల చెత్త కోడిగుడ్లకు ఆయన కుమారుడు లోకేశ్ భయపడే ప్రసక్తే లేదని కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి తెలిపారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ, అల్లరి మూకలతో కోడిగుడ్లు విసిరిస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడితే పాదయాత్ర మానుకుంటామా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలకు భయపడి పనికి మాలిన ఎమ్మెల్యే రాచమల్లు తన ఇంటికి కడ్డీలతో రక్షణ కల్పించుకున్నారని గుర్తు చేశారు. ఇలాంటి కవ్వింపు చర్యలతో పాదయాత్రకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తామని చెప్పారు. పాదయాత్రకు తాను అడ్డంకి కల్పించానని ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకే.. ఎమ్మెల్యే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే ఇప్పటికైన చిల్లర పనులు, చెత్త పనులు మానుకోవాలని సూచించారు. పాదయాత్రలో ఫ్లెక్సీలు వేసుకుంనేందుకు తమకు అనుమతి ఉన్నా.. పోలీసులు అధికార పక్షానికి ఊడిగం చేస్తూ కవ్వింపు చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. కోడిగుడ్లతో దాడికి పాల్పడిన అల్లరి మూకలపై, ఎమ్మెల్యేపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ దాడికి పదింతలు రెట్టించిన ఉత్సాహంతో ముందుకొస్తాం చేతనైతే అడ్డుకోవాల్సిందిగా సవాల్ విసురుతున్నామని మల్లెల లింగారెడ్డి అన్నారు.
టీడీపీ నేతలంతా కలిసి నారా లోకేష్ ను కాపాడుకుంటాం..
కడప జిల్లాలో పదికి పది సీట్లు గెలిచామనే తల పొగురుతో వైసీపీ నాయకులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జీ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. యువతకు, బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీ, ఎస్టీలు అన్ని వర్గాల నుండి యువగళం పాదయాత్రకు మద్దతు లభిస్తోందన్నారు. అబద్ధం పుట్టక ముందే ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పుట్టారని విమర్శించారు. ఉదయం లేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్పడమే ఆయన పనంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. లోకేశ్ పాదయాత్ర సమయంలో వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు కట్టడం కరెక్టేనేమో.. బ్యాలెట్ ఓటింగ్ పెట్టి మరీ ప్రశ్నిద్దాం అన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రొద్దుటూరు పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. పాదయాత్ర, ర్యాలీలు నిర్వహించేటప్పడు వ్యతిరేక పార్టీవారు ఫ్లెక్సీలు కట్టిన చరిత్ర ఇంత వరకూ లేదని ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ సునీతమ్మ టీడీపీలోకి వస్తోందని ఎవరో పోస్టర్ అంటిస్తే.. ఆ పోస్టర్ ఎవరు అంటించారో కనిపెట్టలేని దైన్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వ్యవస్థలను నాశనం చేశారని.. ఒక బకాసురుడు, రాక్షసుడైన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‍పై పోరాడేందుకు ముందుకొచ్చానన్నారు.
రాజకీయాలు, తన స్వార్థం కోసం ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ప్రజల్లో అలజడులు సృష్టించి.. అశాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రొద్దుటూరులో రామమల్లు రాజ్యాంగం నడుస్తున్నా.. ప్రొద్దుటూరు ప్రజల తరపున నిలబడతామన్నారు. ఇకపై మీరు ఒక గుడ్డు విసిరితే.. తాము పది గుడ్లు విసిరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నారా లోకేశ్ పాదయాత్ర కడప జిల్లా దాటేంత వరకు జిల్లా నేతలంతా పసుపు సైనికులతో కలిసి లోకేశ్‍ని కాపాడుకుంటామన్నారు. ఇకపై ఇలాంటి కవ్వింపు చర్యలకు వైసీపీ కార్యకర్తలు పాల్పడాలంటే భయంతో పారిపోయే పరిస్థితి కల్పిస్తామన్నారు.