Nara Lokesh: జగన్ ప్రభుత్వంలో అన్నీ అక్రమ కేసులే! ఇంకా అరెస్టులు ఉంటాయన్నారు: దీక్ష అనంతరం లోకేశ్
Nara Lokesh hunger strike ends in Delhi: ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
Nara Lokesh hunger strike ends in Delhi:
ఢిల్లీ: ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలతో కలిసి లోకేష్ చేపట్టిన ఒక్కరోజు దీక్ష పూర్తయింది. దొంగ కేసులనుంచి న్యాయం, చట్టాలే తమను కాపాడతాయని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా డిల్లీలో లోకేష్ చేపట్టిన నిరాహారదీక్షను ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ కుటుంబసభ్యులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. కక్షగట్టి చంద్రబాబును జైలుకు పంపారని, ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇంకా అరెస్టులు కొనసాగుతాయని చెబుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రజలు, పార్టీ మద్దతుదారులు మొన్న మోత మోగించారు. ఈ రోజు చంద్రబాబుకు మద్దతుగా ఒక్కరోజు దీక్ష చేపట్టిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు తీసుకొచ్చారని చెప్పారు. ఆ స్కిల్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకున్న వారిలో దాదాపు 80 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని, కొందరు విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారని నారా లోకేష్ తెలిపారు. ‘చంద్రబాబు యుద్ధప్రాతిపదికను పనులు చేయడం వల్లే పెద్దఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చాయి. 45సంవత్సరాలు అహర్నిశలు పనిచేసి సైబరాబాద్ తోపాటు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను అభివృద్ధిచేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో తప్పుడు కేసుపెట్టి 24రోజులుగా చంద్రబాబును జైలులో పెట్టారు, 45సంవత్సరాలుగా తెలుగుప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేసినందుకే చంద్రబాబునాయుడుపై తప్పుడు కేసులు బనాయించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గత 24రోజులుగా ప్రజలు శాంతియుతంగా ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు, మోతమోగిద్దాం కార్యక్రమంలో పెద్దఎత్తున సామాన్యులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నిరసన తెలిపేందుకు విజిల్ వేసి, గంటకొడితే కేసు పెడతారా? అందుకే ఆయన పేరు మార్చాను, పిచ్చి జగన్ అని అంటున్నాను’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.
భువనేశ్వరమ్మ పొలిటికల్ యాక్షన్ కమిటీలో అక్టోబర్ 2న నిరాహారదీక్ష చేస్తామని చెప్పారు, ఆమెకు సంఘీభావంగా మేము కూడా దీక్షచేపట్టాం, దీక్షలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే జడ్జి ముందు పెట్టాలి, ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబును జైలుకు పంపడమేగాక మరో 3కేసులు రెడీ చేశారు, మంత్రులు రోజుకోసారి నన్ను, భువనేశ్వరమ్మను, బ్రాహ్మణిని జైలుకు పంపుతామని అంటున్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపే. అయినా మేము తగ్గేదేలేదు, పోరాటం కొనసాగిస్తాం. మాపై పెట్టిన తప్పుడు కేసులను ఆధారాలతో సహా అన్నీ ప్రజల ముందు ఉంచుతామని లోకేష్ అన్నారు.
సత్యమేవ జయతే అంటూ జైల్లో చంద్రబాబు, రాజమండ్రిలోనే భువనేశ్వరి సైతం ఒక్కరోజు దీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి దీక్షకు విశేష స్పందన లభించింది.
సైకిల్ బ్రాండ్ అగరు బత్తీలు వాడినా కేసులే!
టీడీపీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన రావడంతో జగన్ సర్కార్ చర్యలు తీసుకుంది. విజిల్స్ వేసి సౌండ్ చేశారంటూ 60 మందిపై పోలీసులు కేసులు పెట్టారని నేటి ఉదయం నారా లోకేశ్ మండిపడ్డారు. విజిల్ వేస్తే పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ల తీరు చూస్తుంటే చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూశారని, సైకిల్ బ్రాండ్ అగరు బత్తీలు వాడారని, పసుపు రంగు దుస్తులు కట్టుకున్నారని సైతం కేసు పెట్టేలా ఉన్నారంటూ లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసు పెట్టి, ఉరిశిక్ష వేసేయండి అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ పేరును కూడా సీఐడీ ఇటీవల చేర్చింది. లోకేశ్ పేరును ఏ - 14గా సీఐడీ చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై ఆరోపణలున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌ను దక్షిణం వైపున మార్చి లబ్ధి పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ ఆస్తులు పెంచుకోవడం కోసం ఈ అలైన్‌మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు.
14న విచారణకు రావాలని లోకేష్ కు నోటీసులు
ఈ క్రమంలో రెండు రోజుల కిందట నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీకి వెళ్లిన అధికారులు నోటీసులిచ్చారు. అక్టోబర్ 14వ తేదీన ఉదయం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ పేరు చేర్చిన తర్వాత ఎఫ్ఐఆర్ మార్చామని హైకోర్టుకు చెప్పారు, ఎలా మార్చారు.. సాక్షిగా మార్చారా లేదంటే నిందితుడిగానే ఉంచారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.