Nara Brahmani: పాలనలో వైసీపీ లీడర్లు అసమర్థలు- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు - నారా బ్రాహ్మిణి
Nara Brahmani: ప్రజాస్వామ్యాన్ని వైసీపీ అపహాస్యం చేస్తోందని నారా బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆమె సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)లో ఆమె ట్వీట్ చేశారు.
Nara Brahmani: ప్రజాస్వామ్యాన్ని వైసీపీ అపహాస్యం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆమె సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)లో ఆమె ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ, బహుళ జాతి సంస్థలను వైసీపీ అపహాస్యం చేస్తోంది. పాలనలో వైసీపీ నేతలు అసమర్థులు. సీమెన్స్ మాజీ ఎండీ అన్ని అనుమానాలు నివృత్తి చేశారు. వైసీపీ నేతలు మాత్రం కళ్లు ఉండి కూడా వాటిని చూడలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు వెంట ఉన్నారు’ అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.
ఇంటికి దూరంగా నారా, నందమూరి కుటుంబ సభ్యులు
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ దాదాపు వారం రోజులుగా ఆయన కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. వినాయక చవితి రోజున కూడా ఇంటికి దూరంగా ఇక్కడే ఉన్నారు. మరో వైపు ఢిల్లీ వెళ్లిన లోకేశ్ మూడు రోజులుగా అక్కడే ఉన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న లోకేశ్ దంపతుల కుమారుడు దేవాన్ష్ బెంగ పెట్టుకోవడంతో బాలకృష్ణ సతీమణి వసుంధర ఆదివారం రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. భువనేశ్వరి, బ్రాహ్మణి, వసుంధరలను మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ నాయకులు నన్నపనేని రాజకుమారి, ఆదిరెడ్డి అప్పారావు, జ్యోతుల నవీన్, తెలుగు మహిళా నాయకురాలు సత్యవాణి మాట్లాడి వెళ్లారు.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మాట్లాడారు. రాష్ట్రంలో రాజధాని నిర్మించాలన్నా, రహదారులు బాగుపడాలన్నా, శాంతిభద్రతలు కాపాడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా చంద్రబాబు వంటి పరిపాలనాదక్షుడు రాష్ట్రానికి అవసరమన్నారు. చంద్రబాబుకు నష్టం జరిగితే కేవలం ఆ కుటుంబానికే కాదని.. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నష్టపోతుందని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని ఆమె అన్నారు. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, చంద్రబాబును అక్రమంగా కేసుల్లో ఇరికించే యత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
కొవ్వొత్తుల ర్యాలీలో వైసీపీపై బ్రాహ్మిణి విమర్శలు
న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందని, చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబును జైలుకు పంపారని ఆమె ఆరోపించారు. తన భర్త లోకేష్ ను సైతం రేపో, మాపో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేశ్‌కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధికోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు అరెస్ట్ చీకటి దశ అన్నారు.
ఆమె మాట్లాడుతూ.. ‘మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఎప్పుడూ ఊహించలేదు. చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల బాగుకోసం కష్టపడేవారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేతను అక్రమంగా జైల్లో పెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? లక్షలాదిమంది యువతకు నైపుణ్యం మెరుగు పర్చేలా కృషి చేశారు. అభివృద్ధి, సంక్షేమం చేయడం నేరమా? ఉద్యోగాలు కల్పించడం నేరమా? ఇప్పుడున్న ప్రభుత్వం గంజాయి, లిక్కర్ ఇచ్చి యువత జీవితాలను నాశనం చేస్తోంది. చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోంది’ అని అన్నారు.