most trending news in Andhra Pradesh 2022 : కొత్త కేబినెట్ నుంచి మాధవ్ వీడియో వివాదం వరకూ - ఈ ఏడాది ఏపీలో టాప్ ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?
ఏపీలో 2022లో టాప్ ట్రెండింగ్ న్యూస్ ఏమిటంటే ?
most trending news in Andhra Pradesh 2022 : ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రతీ ఏడాది ఈ ఏడాదే ఎన్నికలన్నంత హడావుడిగా రాజకీయాలు చేస్తూంటాయి. ప్రభుత్వమూ అంతే. అందుకే ట్రెండింగ్ న్యూస్ లెక్కలేనన్ని ఉంటాయి. ఇలాంటి వాటిలో ఈ ఏడాది టాప్ టెన్ ట్రెండింగ్ న్యూస్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
13 నుంచి 26 జిల్లాల ఏపీగా మార్పు !
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆ పదమూాడు జిల్లాలను 26 జిల్లాలుగా మార్పు చేసింది. ఉగాది రోజున కొత్త జిల్లాల ఉనికి అమల్లోకి వచ్చింది. గతంలో సగటు జిల్లా జనాభా 38.15 లక్షలు అ..ఇప్పుడు జిల్లా సగటు జనాభా 19.07 లక్షలు . 18 లక్షల నుంచి 23 లక్షల జనాభా ఉండేలా జిల్లాల విభజన చేశారు. రెవెన్యూ డివిజన్లను 51 నుంచి 72కు పెంచారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే విస్తీర్ణం దృష్ట్యా అరకును మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. మిగిలినవన్నీ పాత జిల్లాలు. ఈ జిల్లాల ఏర్పాటుతో ఏపీలో అంతర్గతంగా అనేక మార్పులు వచ్చాయి. ఈ జిల్లాల గురించే ప్రజలు ఎక్కువగా చర్చించుకున్నారు.
మంత్రి గౌతంరెడ్డి మరణం
ఏపీ కేబినెట్‌లోని యువ మంత్రి గౌతంరెడ్డి ఫిబ్రవరిలో హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. ఆయన వయసు యాభై ఏళ్లు మాత్రమే. పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.ఓ సారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గుండెపోటు వచ్చే ముందు రోజే ఆయన దుబాయ్ నుంచి వచ్చారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపి కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఆయన మరణం.. అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఏపీ సినిమా టిక్కెట్ల వివాదానికి ముగింపు
గత ఏడాది సినిమా టిక్కెట్ల వివాదం ఓ రేంజ్‌లో నడిచింది. అయితే ఈ ఏడాది ఆ వివాదానికి ప్రభుత్వం ముగింపు పలికింది. మార్చిలో సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది. థియేటర్లను ఏపీ సర్కార్ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఏపీలో ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. చిన్నసినిమాలకు ఐదో షోలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఒక్కో థియేటర్‌లో రెండు రకాల టికెట్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. థియేటర్లలో కనీస టికెట్ ధర రూ.20 నుంచి గరిష్టంగా రూ. 250 వరకు నిర్ధారించింది ప్రభుత్వం. ప్రతి థియేటర్‌లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రీమియం, నాన్ ప్రీమియంగా ధరలను నిర్ధారించింది. ఈ రేట్లకు జీఎస్టీ అదనమని వెల్లడించింది. హీరో, డైరెక్టర్ పారితోషికం కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. కనీసం 10 రోజుల వరకు సినిమా టికెట్లపై రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జీవోతో సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు పెద్ద సినిమాలైనా టిక్కెట్ రేట్ల పెంపును కోరుకోవడం లేదు.అయితే ప్రభుత్వమే ఆన్ లైన్‌లో టిక్కెట్లు అమ్మాలన్న నిర్ణయం కోర్టులో ఆగిపోయింది.
ట్రెండింగ్‌లో నిలిచిన మోదీ - పవన్, బాబు- పవన్ భేటీలు !
ఈ ఏడాది ఏపీలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన రెండు సమావేశాలు.. చంద్రబాబుతో పవన్ భేటీ, మోదీతో పవన్ భేటీ కావడం. విశాఖపట్నం పవన్ టూర్‌ను పోలీసులు అడ్డుకున్న తర్వాత ఆయనకు సంఘిభావం చెప్పేందుకు చంద్రబాబు విజయవాడలోని ఓ హోటల్‌లో పవన్ ను కలిశారు. ఇది రాజకీయంగా సంచలనం సృష్టించింది. రెండు పార్టీల మధ్య పొత్తు వార్తలు హల్ చల్ చేశాయి. తర్వాత విశాఖ టూర్‌కు వచ్చిన మోదీ.. పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వనించిభేటీ అయ్యారు. ఈ భేటీలో వారేం చర్చించుకున్నారన్నది కూడా హాట్ టాపిక్ అయింది. కానీ అసలు విషయం బయటకు రాలేదు. ఈ రెండు భేటీలు మాత్రం రాబోయే రోజుల్లోనూ ట్రెండింగ్ కానున్నాయి.
రుషికొండ అంశం ఇప్పటికీ చర్చనీయాంశం !
ఈ ఏడాది ఏపీలో ఎక్కువ మంది చర్చించుకున్న వార్తాంశాల్లో ఒకటి రుషికొండ అంశం. రుషికొండను గుండు కొట్టినట్లుగా కొట్టేశారని కేసులు కూడా నమోదయ్యాయి. అక్కడ సీఎం క్యాంపాఫీస్ కడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవే ఈ అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తవ్వకాలపై సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అనుమతికి మించి ఎంతమేర తవ్వకాలు చేశారో తెలపాలని చెప్పింది. అనుమతికి మించి ఎంతమేర భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని పేర్కొంది. ఆ తర్వాత సర్వే నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని తెలిపింది.నిబంధనలను అతిక్రమించినట్టుగా హైకోర్టులో ప్రభుత్వం అంగీకరించింది. మూడు ఎకరాల మేర అదనంగా తవ్వకాలు జరిపామని చెప్పింది. పిటిషనర్లు మాత్రం మూడు కాదని ఇరవై ఎకరాల మేర అదనంగా తవ్వారని తెలిపారు. హైకోర్టు సర్వే చేయాలని తెలిపింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఏడాది అంతా ట్రెడింగ్‌లోనే అమరావతి అంశం !
అమరావతి అంశం ఏడాది మొత్తం ట్రెండింగ్‌లోనే ఉంది. మార్చిలో హైకోర్టు రిట్ ఆఫ్ మాండమాస్ ప్రకటిస్తూ.. ప్రభుత్వానికి షాకిచ్చింది. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పునిచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే స్టే మాత్రం రాలేదు. అదే సమయంలో రైతులు పాదయాత్ర చేశారు. అరసవిల్లి దాకా వెళ్లాలనుకుంటే.. మధ్యలో వైసీపీ నేతల దాడులతో బ్రేక్ పడింది. వచ్చే ఏడాది కూడా అమరావతి అంశం ట్రెండింగ్‌లో ఉండనుంది. అమరావతికి పోటీగా వైసీపీ ప్రాంతాల వారీగా గర్జనలు నిర్వహిస్తోంది.
ఎన్టీఆర్ వర్సిటీ పేరు తొలగింపు వివాదం
ఈ ఏడాది ప్రజలు ఎక్కువగా చర్చించుకున్న అంశాల్లో మరొకటి .. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్చడం. రాత్రికి రాత్రి తీసుకున్న ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నిరసనలు వ్యక్తం చేసింది. అయితే ఏపీలో వైద్య రంగం ఎక్కువగా వైఎస్ వల్లే ఉందని.... అనేక మెడికల్ కాలేజీలు పెట్టారని అందుకే.. ఆయన పేరు సముచితమని పెడుతున్నామని జగన్ వాదించి పెట్టేశారు. ప్రస్తుతం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ లేదు.. వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీ ఉంది.
ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు
ఏప్రిల్‌లో ఏపీ సీఎం జగన్ మంత్రులందరితో రాజీనామాలు చేయించి.. కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేశారు. ఈ అంశం కూడా హాట్ టాపిక్ అయింది. పాత మంత్రివర్గంలోని 11 మందిని మళ్లీ మంత్రివర్గంలో తీసుకోగా.. కొత్తగా 14 మందికి స్థానం కల్పించారు. పూర్తిగా ఎన్నికల కోణంలో కొన్ని సామాజికవర్గాలకు పదవుల్ని తీసేయడం.. మరికొన్ని సామాజికవర్గాలకు పదవులు కేటాయించడం చేయడంతో .. ఈ కూర్పు కూడా చర్చనీయాంశమైంది . కొన్ని కులాల ఓట్లు రావని జగన్ డిసైడై ఇలా చేశారని చర్చించుకున్నారు. ఈ కేబినెట్ మార్పు ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది.
వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ
వివేకా హత్య కేసు ఏపీలో రాజకీయంగానూ హాట్ టాపికే. ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం ట్రెండింగ్‌లో నిలిచింది. సాక్షులను నిందితులు బెదిరిస్తున్నందున తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టు కేసును విచారిస్తుందని స్పష్టం చేసింది. 2019 మార్చి 15 న వివేకానందరెడ్డి హత్య జరిగింది. తొలుత గుండెపోటుతో చనిపోయారని వార్తలు వచ్చినా ఆ తర్వాత హత్యగా తేలింది. అయితే కేసు విచారణపై వివేకా కూతురు సునీత అనుమానం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మాధవ్ వీడియో రచ్చ
గోరంట్ల మాధవ్ పూర్తిగా న్యూడ్ గా అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్న ఓ వీడియో కాల్‌కు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఈ వీడియో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికీ ఆ వార్త ట్రెండింగ్‌లో ఉంది. ఆ వీడియో ఫేక్ అని గోరంట్ల మాధవ్ ఆరోపిస్తున్నారు. అయితే సీఐడీ పోలీసులు అది ఫేకా వర్జినలా అన్న కోణంలో విచారణ చేయకుండా ఎవరు సర్క్యూలేట్ చేశారన్న కోణంలో కేసులు పెట్టారు. ఇది కూడా వివాదాస్పదమయింది.
ఇవీ 2022లో ఏపీలో ట్రెండింగ్ న్యూస్.