Minister Amarnath: 'నా తలరాతను రాసేది సీఎం జగన్' - వైసీపీ విజయం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్న మంత్రి అమర్నాథ్
AndhraPradesh Politics: వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దానిపై స్పష్టత రాలేదంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి అమర్నాథ్ వివరణ ఇచ్చారు. సీఎం జగన్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు.
Minister Amarnath Comments on His Seat: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ (Amarnath) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విశాఖలో (Visakha) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ (CM Jagan) కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని.. తన రాజకీయ భవిష్యత్తుపై గతంలో ఏం చెప్పానే, ఇప్పుడూ అదే చెప్తున్నానని స్పష్టం చేశారు. ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ అర్జునుడు అయితే, ఆయన సైన్యంలో తాను ఓ సైనికుడిగా పని చేస్తానని చెప్పారు. 'నా కుటుంబం గడిచిన 46 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది. పది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత కూడా ఉంది. తన 28వ ఏటనే అనకాపల్లి (Anakapally) ఎంపీగా పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించారు. 34వ ఏటనే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాను. ఆ తర్వాత తనను మంత్రిని చేసిన జగన్మోహన్ రెడ్డికి తాను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆయన దగ్గర నుంచి ప్రేమాభిమానాలు ఆశించే వ్యక్తిని. పార్టీ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి తనను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నా అందుకు సిద్ధంగా ఉన్నాను. నా రాజకీయ తలరాతను జగన్మోహన్ రెడ్డి రాస్తారు. తాను ఎప్పటికీ ఆయన వెంట నడుస్తాను. ఇంతకు మించి తనకు వేరే ఆలోచన లేదు.' అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
చంద్రబాబు, పవన్ భేటీపై
టీడీపీ - జనసేన మధ్య సీట్ల పంపకం విషయంలో చంద్రబాబు, పవన్ భేటీపై అమర్నాథ్ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ ఒంటరిగా రెండు సీట్లు ప్రకటిస్తే 'కాపోడు.. మగోడు' అనుకున్నానని అన్నారు. అయితే, ఇప్పుడు 25 - 30 సీట్లకు జనసేన ఒప్పుకొన్నట్లు ప్రచారం జరుగుతోందని.. అదే జరిగితే జనసేన నాయకులు బాధపడక తప్పదని అన్నారు. జనసేనకు ఉన్న బలం ఏంటో టీడీపీతో సర్దుబాటుతోనే తేలిపోతుందంటూ ఎద్దేవా చేశారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధం
2014 - 19 మధ్య జరిగిన పారిశ్రామిక అభివృద్ధికి, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధికి చాలా తేడా ఉందని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమర్నాథ్ సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో రూ.30 వేల నుంచి రూ.40 వేల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రూ.90 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తద్వారా 1.20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ఎం.ఎస్.ఎం.ఈలను అంచనాలకు మించి తీర్చిదిద్దామని.. తద్వారా 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. చంద్రబాబు హయాంలో లక్ష పరిశ్రమలు మూత పడిన విషయం వారికి గుర్తు లేదా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడు కొత్త పోర్టులు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అదానీ డేటా సెంటర్ వంటివి రూపుదిద్దుకుంటున్న విషయం ప్రతిపక్షాలు గుర్తించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇన్ఫోసిస్, విప్రో, ఐబీఎం, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యదక్షతే కారణమని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలో రావడం కోసం రాష్ట్ర భవిష్యత్తును దెబ్బ కొట్టే ప్రయత్నం చేయొద్దని ప్రతిపక్షాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారంటే వైసీపీ ప్రభంజనం ఎంత ఉద్ధృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చని మంత్రి అమర్నాథ్ అన్నారు. జగన్ చెప్పిన స్టార్ క్యాంపెయినర్లలో అమర్నాథ్ ఒకడని.. జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరమని అన్నారు. 'సిద్ధం' సభల్లో వైసీపీ విజయోత్సవం కళ కనిపిస్తోందని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఎన్ని రోజులు చర్చలు జరిగిన ఒరిగేదేమీ లేదని వైసీపీ విజయాన్ని వీరు అడ్డుకోలేరని మంత్రి జోస్యం చెప్పారు.
Also Read: MP Balasouri: జనసేనలోకి ఎంపీ బాలశౌరి - సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు