MP Balashauri: జనసేనలోకి ఎంపీ బాలశౌరి - సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు
Janasena News: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆదివారం జనసేన పార్టీలో చేరారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయన.. పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
MP Balashauri Joined in Janasena: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాలశౌరికి కండువా కప్పి తమ పార్టీలోకి పవన్ సాదరంగా ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ సైతం జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. కాగా, ఇటీవలే బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలశౌరి గుంటూరులోని ఆయన నివాసం నుంచి వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా మంగళిగిరి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై బాలశౌరి తీవ్ర విమర్శలు చేశారు.
'పవన్ తోనే రాజకీయ జీవితం'
పవన్ సమక్షంలో జనసేనలోకి వచ్చినందుకు తనకు ఆనందంగా ఉందని.. ఇక పవన్ తోనే తన రాజకీయ జీవతం అని బాలశౌరి స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో ఎంపీగా చేసినప్పుడు తనకు చాలా తృప్తిగా అనిపించిందని.. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. దమ్ము, ధైర్యంతో గొంతెత్తే వ్యక్తి పవన్ అని కొనియాడారు. రాష్ట్రంలో పవన్ ఉండడం వల్లే కొద్దో గొప్పో ప్రజాస్వామ్యం అమలవుతోందని చెప్పారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి భయపడి ఎవరూ టెండర్లు వేయడానికి రావడం లేదని అన్నారు. సీఎం జగన్ ఎప్పుడూ అబద్దాలు చెప్పను అని చెప్తుంటారని అదే పెద్ద అబద్దమని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో ఓ సైనికుడిలా నెరవేరుస్తానని.. ఆయన నాయకత్వంలో జనసైనికులు వేటాడుతారని అన్నారు.
'ఓట్లు ఎలా అడుగుతారు.?'
'2019లో రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పి సీఎం జగన్ ఓట్లు అడిగారు. 2024లో ఏ మొహం పెట్టుకుని వారు ఓట్లు అడుగుతారో ఆయన చెప్పాలి. వందల కోట్లు పెట్టి 'సిద్ధం' మీటింగ్స్ పెడుతున్నారు. హోర్డింగ్స్ కడుతున్నారు. ఇంతకీ వైసీపీ దేనికి సిద్ధం.? పారిపోవడానికి సిద్ధమా.?' అంటూ బాలశౌరి సెటైర్లు వేశారు. 2019 నుంచి 2024 వరకూ వైసీపీలో జరిగినవన్నీ తనకు తెలుసని.. రానున్న రోజుల్లో అన్నీ వివరిస్తానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే పవన్ కు అండగా ఉంటానని.. జనసేన కుటుంబ సభ్యుడిని కావడం సంతోషంగా ఉందని చెప్పారు.