Chandrababu - Pawan: ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ - సీట్ల సర్దుబాటుపై పూర్తి స్పష్టత, త్వరలోనే ప్రకటన!
TDP janasena Meeting: ఎన్నికల సమరానికి టీడీపీ, జనసేన సిద్ధమయ్యాయి. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ ఆదివారం జరిపిన భేటీలో పూర్తి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
Chandrababu And Pawan Meeting For Seats Adjustment: వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని (Undavalli) చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. దాదాపు 3 గంటల పాటు ఈ అంశంపై చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు పూర్తి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి.?, ఏయే నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైనా చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
జనసేనకు ఎన్ని సీట్లంటే.?
ఈ సమావేశంలో జనసేనకు 25 నుంచి 30 స్థానాలు కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, తమవైపు నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారని.. ఇంకొన్ని స్థానాలు కేటాయించాలని పవన్ చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 50 శాతం షేర్ ఉండాలని జనసేన చెబుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. విశాఖలోనూ పార్టీ బలంగా ఉందని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, గత 4 రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన ఇరువురు నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు నచ్చచెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు ఆ పార్టీ అధిష్టానం హామీ ఇవ్వనుంది. అటు, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు సద్ది చెప్పి వారి పొలిటికల్ కెరీర్ కు జనసేన అధిష్టానం హమీ ఇవ్వనుంది. సీట్ల అంశంపై ఇరు పార్టీల నేతలకు నచ్చజెప్పాక ఓ మంచి రోజు చూసుకుని స్థానాలను ప్రకటించేందుకు చంద్రబాబు, పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.