Mega PTM in Guinness Records: ఏపీ విద్యా శాఖ మరో రికార్డు - గిన్నిస్ రికార్డుల్లో మెగా పీటీఎం - లోకేష్ అభినందన
Guinness World Records: ఏపీలో జరిగిన మెగా పీటీఎం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ ఈ రికార్డు ఉపాధ్యాయులకే అంకితమని నారా లోకేష్ అభినందించారు.

Mega PTM held in AP enters Guinness World Records: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగ్ (MEGA PTM) నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని, ఈ గిన్నిస్ రికార్డు ఉపాధ్యాయులకు అంకితం అని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం మెగా పీటీఎంలో 5.34 మిలియన్ల (53.4 లక్షలు) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) సభ్యులు, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారితో సహా మొత్తం 15.2 మిలియన్ల (1.5 కోట్లు) మంది అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగులో భాగమయ్యారు.
జాతీయ విద్యా విధానం ఐదవ వార్షికోత్సవం జూలై 29కి ఒక రోజు ముందు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ రికార్డు గొప్ప ప్రోత్సాహంగా నిలిచిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు MEGA PTMని విజయవంతం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. ఈ అరుదైన రికార్డు సాధనలో భాగమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విద్యా వికాసానికి, సమ్మిళిత విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, విద్యాశాఖ చేస్తున్న కృషిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించడం హర్షణీయమన్నారు.
MEGA PTM నుండి సేకరించిన డేటాను నిశితంగా ఆడిట్ చేసిన తర్వాత ఈ రికార్డు అధికారికంగా గిన్నిస్ రికార్డు బృందం ధ్రువీకరించింది. ఇందులో మూడు ఫోటోగ్రాఫ్‌లు, ఒక వీడియో, తల్లిదండ్రులు , ఉపాధ్యాయుల సంఖ్య, పాల్గొన్న ప్రతి పాఠశాల నుండి ఇండిపెండెంట్ విట్నెస్ ద్వారా డేటాను LEAP యాప్ ద్వారా సేకరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నియమించిన 40 మందికి పైగా ఆడిటర్లు ఈ అవార్డును నిర్ధారించడానికి 61000 పాఠశాలల నుండి సేకరించిన డేటాను విశ్లేషించారు. అధికారిక గిన్నిస్ ప్రపంచ రికార్డు ధృవపత్రం ఆగస్టు రెండవ వారంలో అమరావతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తారు.'
మరో వైపు కాలేజీలు ఖాళీ అంటూ వచ్చిన మీడియా వార్తలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో గత ఏడాది కాలంగా మేము తెచ్చిన సంస్కరణల కారణంగా 2025-26లో దాదాపు 18శాతం అడ్మిషన్లు పెరిగాయి. UDISE డేటా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈనెల 31వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. ప్రకాశం జిల్లా కనిగిరి వంటి మారుమూల కళాశాలల్లో అడ్మిషన్లు రెట్టింపు కావడం ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. విద్యార్థులు, అధ్యాపకుల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే తప్పుడు రాతలపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
జగన్మోహన్ రెడ్డి అవినీతి విష పుత్రిక, రోత పత్రిక సాక్షిలో ఈరోజు కాలేజీలు ఖాళీ అంటూ అబద్ధాలను వండి ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో గత ఏడాది కాలంగా మేము తెచ్చిన సంస్కరణల కారణంగా 2025-26లో దాదాపు 18శాతం అడ్మిషన్లు పెరిగాయి. UDISE డేటా ఈ విషయాన్ని… pic.twitter.com/NTIhBKNTYp
— Lokesh Nara (@naralokesh) July 28, 2025





















