TDP Polit Bureau: కడపలో మహానాడు - జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చ - టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు
Andhra Pradesh: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో పలు కీలక అంశాలపై చర్చించారు. రెండు రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు.

TDP Mahanadu in Kadapa: తెలుగుదేశంపార్టీ ఈ సారి మహానాడును కడపలో నిర్వహిచాలని నిర్ణయించారు. చంద్రబాబు నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఇందులో మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. విశేషమైన గెలుపు సాధించినందున.. రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో కూటమి కడపలో ఏడు సీట్లలో కూటమి విజయం సాధించింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఇదే అతి పెద్ద విజయం. అందుకే ఈ సారి అక్కడ మహానాడును నిర్వహించాలని డిసైడయ్యారు. టీడీపీ మహానాడును ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. ఎన్టీఆర్ జయంతి రోజు అంటే మే 28వ తేదీన ఓ రోజు మహానాడు ఉంటుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప జిల్లా ఆ కుటుంబానికి కంచుకోటగా మారింది. ఒక్క సీటు గెల్చుకోవడమే టీడీపీకి గగనంగా మారింది. అయితే వైఎస్ చనిపోయిన తర్వాత సెంటిమెంట్ ఊపులో జగన్ మంచి ఫలితాలు సాధించినా గత ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. కడపలో వైసీపీని మరింతగా దెబ్బకొడితే ఇక ఆ పార్టీ పునాదులు కదిలిపోతాయని అంచనా వేస్తున్నారు. అందుకే కడపలో సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేదుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల, కడపల్లో కూడా గెలిచేందుకు టీడీపీ ఈ మహానాడు వేదికగా ప్రణాళికలు సిద్దం చేసుకునే అవకాశం ఉంది.
సీపీ హయంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో చేసిన తప్పులను సరిదిద్దాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్లు పునరుద్దరించేందుకు చట్టపరమైన అంశాలు పరిశీలించాలని ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులకు సీఎం చంద్రబాబు సూచించారు. గత ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి రూ. ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినా.. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. అన్నదాత సుఖీభవ కేంద్రం రూ. 6 వేలు ఇచ్చినా మిగిలిన రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3 విడతల్లో రూ. 20 వేలు చెల్లిద్దామన్నారు. తల్లికి వందనం పథకాన్ని జూన్ లో ఇస్తామని గతంలో ప్రకటించారు. ఆ మేరకు అమలు చేసే దిశగా నిధులను సమీకరించుకోనున్నారు. సంస్థాగత ఎన్నికలపైనా పొలిట్ బ్యూరోలో చర్చించారు. మహానాడులోపు అన్ని స్థాయిల్లో కమిటీలను నియమించుకోవాలని నిర్ణయించారు.
Also Read : ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, చిత్తశుద్ధితో పని చేయాలి - ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలతో టెలీకాన్ఫరెన్సులో చంద్రబాబు





















