East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో పులి కలకలం, సీసీ కెమెరాలో రికార్డ్ - ప్రజలకు డీఎఫ్‌ఓ జాగ్రత్తలు
Cheetah in East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాజమండ్రి నగర శివారులో చిరుత పులి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
Leopard in East Godavari : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అటవీ ప్రాంత పరిధిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు పుష్కరవనం మధ్యలో అటవీశాఖ సిబ్బంది నివాసాలు ఉన్న ప్రాంతం వైపు చిరుత ఓ నల్లని జంతువుపై దాడి చేసి దివాన్ చెరువు నేషనల్ హైవే పై రోడ్డు దాటడాన్ని వాహనదారులు గమనించారు. చిరుత సంచారంపై స్థానికులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. వారు వెంటనే స్పందించి ఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించారు.
అటవీ పరిసరాల్లోనే సంచారం
జిల్లా ఇంఛార్జ్ డీఎఫ్ఓ భరణి మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత పులి కదలికలని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. పులి కదలికలు తెలుసుకునేందుకు 36 ట్రాప్ కెమెరాలు అమర్చామని.. ఆదివారం ఉదయం ఐదు గంటలకు రెండు కెమెరాల్లో పులి సంచరిస్తున్నట్లు రికార్డయ్యాయని తెలిపారు. అత్యధిక జన సంచారం ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోనే చిరుత పులి సంచరిస్తోందన్నారు. దానిని తిరిగి అడవిలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో చిరుతను బోన్ల సాయంతో బంధిస్తామని.. అందుకోసం రెండు బోన్లు కూడా అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. అటవీ సమీపంలోని ప్రజలు ఎవరూ కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత బయట తిరగవద్దని సూచించారు.
నిపుణుల బృందాలు ఏర్పాటు
అటవీ ప్రాంతంలో కొన్ని కెమెరాలను ఏర్పాటు చేయడంతో పులిని పట్టుకునేందుకు నిపుణుల బృందాలు గాలిస్తున్నాయని జిల్లా ఇంఛార్జ్ డీఎఫ్ఓ భరణి తెలిపారు. వీటితో పాటు థర్మల్ డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించి శోధిస్తున్నామన్నారు. కొన్నిచోట్ల కెమెరాలలో కనిపించిన దృశ్యాల ఆధారంగా అది దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్టులోనే ఉందని, దాని పాద ముద్రలు గుర్తించామన్నారు. అయితే ఇంత వరకూ దాని వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. అలాగే పులి సంచారంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.
వెంటాడుతున్న భయం
రాజమండ్రి శివారులోని దివాన్‌చెరువు ప్రాంత ప్రజలను చిరుతపులి భయం వెంటాడుతోంది. గత పది రోజులుగా చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అది చిక్కక దొరకక ముప్పు తిప్పలు పెడుతుంది. అధికారులు బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ అది అందులో చిక్కడం లేదు. దివాన్‌చెరువు ప్రాంతానికి ఆనుకుని అటవీశాఖకు చెందిన 950 ఎకరాల అటవీభూముల్లో చిరుత సంచరిస్తూ రాత్రివేళల్లో అది జనావాసాల చెంతకు వస్తోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు థర్మల్ డ్రోన్లును ప్రయోగిస్తున్నా అడవిలో దట్టంగా ఉన్న పొదల కారణంగా చిరుత డ్రోన్లుకు సైతం చిక్కడం లేదు. అయితే ట్రాప్ కెమెరాలో మాత్రం రెండుసార్లు రికార్డు అయ్యింది.. దీంతో చిరుత పులి దివాన్‌చెరువు ప్రాంతానికి ఆనుకుని ఉన్న అడవిలోనే ఉందని ఫారెస్ట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సీతాఫలాలకు నెలవు
రాజమండ్రి దివాన్ చెరువు అనగానే సీతాఫలాలు ఎక్కువగా దొరుకుతాయని చాలా మందికి తెలుసు.. దివాన్‌చెరువు ప్రాంతానికి ఆనుకుని ఉన్న భూముల్లో చాలా మంది రైతులు సీతాఫలాల్ని పండిస్తుంటారు. పైగా ఇది సీజన్ కావడం వల్ల రైతులు, కూలీలు అంతా పొలాల్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే గత పదిరోజులుగా చిరుతపులి ఈప్రాంతంలోనే సంచరిస్తుందని తెలియడంతో ఇక్కడి రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లలేకపోతున్నామని, పులి భయంతో సీతాఫలాలు కోసేందుకు కూలీలు రావడంలేదని వాపోతున్నారు. మొత్తం మీద చిరుతపులి భయంతో తమకు నష్టం వాటిల్లుతోందంటున్నారు.