YS Avinash Reddy: పులివెందుల జడ్పీటీసీ బైపోల్స్.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్టు
ZPTC ByElection in Pulivendula and Vontimitta | పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభం
కడప: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ జిల్లా పులివెందుల (Pulivendula)తో పాటు ఒంటిమిట్టలో మంగళవారం జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రెండు మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు కడప ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత అవినాష్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించగా, ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడే నిరసనకు దిగారు. అనంతరం వైసీపీ కార్యకర్తలను పంపించివేసిన పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
ఈ ఉపఎన్నికలను వైఎస్సార్‌సీపీతో పాటు, కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో కొనసాగనుంది. భద్రత చర్యలుగా రెండు మండలాల్లో దాదాపు 1,500 మంది పోలీసులను మోహరించారు. పులివెందులలో పోలింగ్ బూత్‌లను సున్నితమైనవిగా ప్రకటించడంతో అన్ని చోట్ల వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఒంటి మిట్టలో వెబ్‌కాస్టింగ్ లేని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్ ను నియమించి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డ్రోన్స్, APSP బాటాలియన్స్, మొబైల్ సర్వైలెన్స్ వాహనాలు, క్లస్టర్ ఆధారిత పోలీస్ పర్యవేక్షణతో పటిష్ట భద్రత, నిఘాతో ఎన్నికలు జరుగుతున్నాయి.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అత్యంత దారుణంగా లాక్కెళ్లిన పోలీసులు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినని పోలీసులు. అరెస్టును అడ్డుకున్న అవినాష్ రెడ్డి అభిమానులు pic.twitter.com/FFefOp7iM5
— YSR Congress Party (@YSRCParty) August 12, 2025
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి, వైసీపీ నేతలు
పులివెందుల జడ్పీటీసీ స్థానం కోసం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య జరుగుతోంది. మొత్తం 10,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పులివెందుల జడ్పీటీసీలో 6 గ్రామ పంచాయతీలు,15 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఉన్నాయి. పులివెందుల పట్టణం మున్సిపాలిటీగా ఉందని తెలిసిందే. అలాగే ఒంటిమిట్ట మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇక్కడ 24,606 ఓటర్లు ఉన్నారు.
బరిలోకి బీటెక్ రవి భార్య, వివేకా హత్య కేసు నిందితుడు
పులివెందుల నుంచి బరిలోకి దిగిన వారిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ఉన్నారు. టీడీపీ పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి తన సతీమణిని జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో నిలిపారు. ఎలాగైనా సరే ఈ 2 జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవాలని కూటమి నేతలు భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ సైతం పులివెందుల జెడ్పీటీసీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత కొన్ని దశాబ్దాలుగా పులివెందుల, కడపలో ఏ ఎన్నికలు జరిగినా ఏకపక్షంగా ఫలితాలు వచ్చేవి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలోనూ కూటమి సీట్లు సాధించింది. దాంతో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో తమదే విజయం అని దీమాగా ఉన్నారు. ఈ రెండు చోట్ల జరుగుతున్న ఎన్నికల్లో రీపోలింగ్ కనుక అవసరం అయితే రేపు (బుధవారం) అక్కడ ఎలక్షన్ నిర్వహిస్తారు.






















