Paritala Sunitha: వైసీపీ పాలనలో నష్టం, నేటి ధరల ప్రకారం ఆ రైతులకు పరిహారం ఇవ్వాలి: పరిటాల సునీత విజ్ఞప్తి
Andhra Pradesh News | వైసీపీ చేతకానితనం వల్ల రైతులు గత అయిదేళ్లు నష్టపోయారని, నేటి ధరల ప్రకారం ఆ రైతులకు పరిహారం ఇవ్వాలని అసెంబ్లీలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు.
AP Assembly Session | మంగళగిరి: గత ఐదేళ్లుగా రాప్తాడు నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. పేరూరు ప్రాజెక్టుతో పాటు పీఏబీఆర్ పరిధిలోని రైతులు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలని అసెంబ్లీలో పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు.
హంద్రీనీవా నుంచి పేరూరు ప్రాజెక్టుకు నీరు
పెన్నా నదిపై సుమారు 66 ఏళ్ల క్రితం పేరూరు ప్రాజెక్టు నిర్మించారని.. ఆ రోజుల్లోనే 1.08 టీఎంసీల కెపాసిటీతో, ఒక కోటి 69 లక్షల రూపాయలు వెచ్చించి రిజర్వాయర్ నిర్మించారని గుర్తు చేశారు. అయితే రిజర్వాయర్ నిర్మించి 66 ఏళ్ళు పూర్తయినా.. ఇప్పటివరకు కనీసం 16 సార్లు కూడా పూర్తిస్థాయిలో నీరు రాలేదన్నారు. 2012 సంవత్సరంలో అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో పేరూరు ప్రాజెక్టుకు హంద్రీనీవా జలాలు ఇస్తానని హామీ ఇచ్చారు. 2012లో ఇచ్చిన హామీ ప్రకారం 804 కోట్ల రూపాయలతో హంద్రీనీవా నుంచి పేరూరు ప్రాజెక్టుకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఇందుకోసం 54 కిలోమీటర్ల మేర కాలువ, నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లు, సోమరవాండ్లపల్లి, పుట్ట కనుమ రిజర్వాయర్లు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. 2000 ఎకరాలు భూమి కూడా సేకరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వెయ్యి ఎకరాలు ఇచ్చారన్నారు. అయితే కేవలం 95 ఎకరాలకు మాత్రం కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారన్నారు.
Also Read: Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
ప్రకాష్ రెడ్డి చేతకానితనం వల్ల రైతులకు తీవ్ర నష్టం
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతకానితనం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారంటూ పరిటాల సునీత పేర్కొన్నారు. ప్రతిపాదించిన ప్రాజెక్టులు నిర్మించకుండా కొత్త డిజైన్లు తీసుకొచ్చారన్నారు. కనీసం ఒక్క ఎకరా కూడా భూమి సేకరించలేదని విమర్శలు చేశారు. భూములు ఇచ్చిన రైతులు ఐదేళ్లపాటు పంటను కూడా కోల్పోయారని తెలిపారు. వర్షం వల్ల ప్రాజెక్టుకు నీరు చేరితే... దిగువ ప్రాంతాలకు విడుదల చేసేందుకు గేట్లను ఎత్తే క్రమంలో మూడు గేట్లు విరగ్గొట్టారని దానివలన నీరంతా ఏరు పాలైందన్నారు. నేటికీ ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేరూరు ప్రాజెక్టుకు నీరు వస్తుందన్న ఆశలతో ఉన్నారని చెప్పారు. అందుకే ప్రస్తుత ధర ప్రకారం భూములు ఇచ్చిన రైతులందరికీ నేటి ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మరోవైపు పీఏబీఆర్ కుడికాలువ ద్వారా అనంతపురం జిల్లాలో 29 చెరువులు, శ్రీ సత్యసాయి జిల్లాలో 24 చెరువులు మొత్తం ఉమ్మడి జిల్లాలో 53 చెరువులకు నీరు అందించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇందుకోసం ఐదు నుంచి ఏడు టీఎంసీల నీరు అవసరం ఉందన్నారు ప్రభుత్వం ఈ ప్రాంత రైతులను దృష్టిలో ఉంచుకొని 5 నుంచి 7 టీఎంసీలు నీటిని పీఏబీఆర్ కుడికాలువకు విడుదల చేయాలని పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు.