Satya Sai Trust: సత్యసాయి జిల్లాలో కబ్జాల పర్వం- ఉజ్వల్ ఫౌండేషన్ అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ
స్వార్థ చింతన లేని ఆ ప్రాంతంలో భూ కబ్జాలకు పాల్పడుతూ రిజర్వు స్థలాలను తెగనమ్మేస్తున్నారు కొందరు స్వార్థపరులు. విశ్వశాంతి కోసం అహర్నిశలు పరితపించిన ఆ అమృతమూర్తి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు.
సాయిరాం నామస్మరణతో మారుమోగే ఆధ్యాత్మిక కేంద్రం అది.. శ్వేత వర్ణం దుస్తులు ధరించి సేవా మార్గంలో నడుచుకునే బాబా భక్తులు తిరిగే స్థలమది. అనంత జిల్లా దాహార్తిని తీర్చిన సేవమూర్తి నడయాడిన ప్రాంతం అది.. సేవే మార్గం నినాదంతో నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న ప్రశాంతి నిలయం అది.. కానీ ఖద్దరు చొక్కాలు ధరించిన కొంతమంది రాజకీయ నాయకులు ప్రశాంతి నిలయంలో అశాంతి సృష్టిస్తున్నారు.
స్వార్థ చింతన లేని ఆ ప్రాంతంలో భూ కబ్జాలకు పాల్పడుతూ రిజర్వు స్థలాలను తెగనమ్మేస్తున్నారు కొందరు స్వార్థపరులు. విశ్వశాంతి కోసం అహర్నిశలు పరితపించిన ఆ అమృతమూర్తి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
సత్యసాయి జిల్లాగా ప్రకటన వెలువడిన అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అమాంతం భూముల రేట్లు పెరగడంతో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల కళ్ళు ఖాళీ జాగాలపై పడింది. ఆలస్యం చేయకుండా అక్రమార్కులు భూములను కబ్జా చేస్తూ యథేచ్ఛగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా కబ్జాకు గురైనదే ఉజ్వల ఫౌండేషన్.
1992లో ఉజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6.30 ఎకరాల్లో కాటేజీలు నిర్మించి భక్తులకు విక్రయించారు. పుడా (పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ) రాక ముందు సుడా (సత్యసాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఉండేది. సుడా నియమాల ప్రకారం అన్ని అనుమతులు పొంది కాటేజీలు నిర్మించి అప్పట్లో విక్రయించారు. అయితే భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకొని 10 శాతం స్థలాలను లైబ్రరీ, పార్కులు, ఆలయ నిర్మాణాలకు రిజర్వ్ చేసి వదిలిపెట్టారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న రిజర్వ్ స్థలాలపై కన్నువేసిన కబ్జాదారులు వాటిని ఆక్రమించి అక్రమంగా విక్రయిస్తున్నారు. ఏకంగా బేస్మెంట్‌లు సైతం నిర్మిస్తున్నారు. దీంతో నమిత అనే ఓ మహిళ అందరికీ సంబంధించిన ఉమ్మడి జాగాలను విక్రయిస్తున్నారని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
ఫిర్యాదు దారులపై దౌర్జన్యాలకు సైతం కబ్జాదారులు వెనకాడటం లేదు. ఈ వ్యవహారంలో ప్రముఖ రాజకీయ పార్టీల నాయకుల హస్తం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి స్థానిక ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, పుడా వైస్ ఛైర్మన్‌లతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ కాల పరిమితి విధించారు. ప్రస్తుతం ఉజ్వల ఫౌండేషన్ భూముల వ్యవహారం పుట్టపర్తిలో హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రంలో కబ్జా పర్వాలకూ తెరలేపి అశాంతి నెలకొల్పుతున్న ఖద్దరు చొక్కాలపై కఠినంగా వ్యవహరించాలని భక్త జనం నుంచి డిమాండ్ పెరుగుతోంది.