Devaragattu Bunny Utsavam: దేవరగట్టు బన్నీ ఉత్సవం రక్తసిక్తం- ముగ్గురు మృతి, 100 మందికి పైగా గాయాలు
Devaragattu Banni Utsavam: కర్నూలు జిల్లా హోళగొంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో మరో సారి తలలు పగిలాయి. కర్రల సమరంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.
Devaragattu Banni Utsavam: కర్నూలు జిల్లా హోళగొంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో మరో సారి తలలు పగిలాయి. కర్రల సమరం సమయంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. కర్రల దాడిలో ఇద్దరు మృతి చెందగా.. సింహాసనం కట్ట దగ్గర చెట్టు కొమ్మ విరిగిపడి మరొకరు మృత్యువాత పడ్డారు. ఈ కర్రల కొట్లాటలో మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆలూరు, బళ్లారి, ఆదోని ఆస్పత్రులకు తరలించారు. అయితే ఈ సారి భక్తులు కాగడాలతో సమరానికి దిగారు. దివిటీలను గాల్లోకి ఎగరేశారు. అవి మీద పడడంతో పలువురికి కాలిన గాయాలయ్యాయి.
స్వామి వారి కోసం కర్రలతో పోరు
దేవరగట్టులో దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. అర్ధరాత్రి వేళ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడం కోసం అక్కడి స్థానిక ప్రజలు పోటీ పడతారు. సాంప్రదాయం, ఆచారం పేరిట ఈ పోరు ఈ ఏడాది కొనసాగింది. ఈ ఉత్సవంతో అక్కడి వాతావరణం ఓ వైపు కోలాహలంగానూ, మరోవైపు రక్తసిక్తంగా మారింది.
ఫలించని పోలీసుల చర్యలు
ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్న బన్నీ ఉత్సవాలలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసులు అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఫలితం శూన్యం. దాదాపు 2000 వేల మంది పోలీసులతో బందోబస్తు.. అలాగే, 100 మంది రెవెన్యూ, 100 మంది విద్యుత్ శాఖ సిబ్బంది, మరో 100 మందు వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది కూడా డ్యూటీ నిర్వహించారు. అయినా వేల మంది భక్తుల ముందు పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ కర్రల సమరంలో గాయపడ్డ భక్తుల చికిత్స కోసం 100 పడకల తాత్కాలిక ఆసుపత్రి కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. అయితే ఇవేవీ కర్రల పోరును ఆపలేకపోయాయి. వేల సంఖ్యలో ప్రజలు కర్రలతో వస్తుండంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్ట తరంగా మారింది. దేవరగట్టులో రక్తపాతం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినా చివరకు సంప్రదాయమే గెలుస్తోంది.
ఏటా మరణాలు సంభవిస్తున్నా, పదుల సంఖ్యలో గాయపడుతున్నా ప్రజలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ ఉత్సవం ఇలా జరగడం సంప్రదాయమని చెబుతున్నారు. తమ ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తామని, మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదని స్థానిక భక్తులు అంటున్నారు.
ఉత్సవానికి చరిత్ర
ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. బన్నీ ఉత్సవానికి ముందు వచ్చే అమావాస్య నుంచి నెరిణికి తండా, నెరిణికి, కొత్తపేట గ్రామాలకు చెందిన భక్తులు దీక్షలు చేపడతారు. ఉత్సవాలు ముగిసే వరకు చాలా నిష్టతో దీక్ష చేస్తారు. మాల మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం తర్వాత ఉత్సవ మూర్తులను తరలించే క్రమంలో కర్రల సమరం జరుగుతుంది. ఈ మూడు గ్రామాల ప్రజలు.. ఇతర గ్రామాల నుంచే వచ్చే భక్తులు వర్గాలుగా విడిపోయి కర్రలతో సమరానికి తెరలేపుతారు. ఉత్సవ విగ్రహాలు సింహాసనం కట్ట దగ్గరకు చేరుకున్న తర్వాత బన్నీ ఉత్సవం ముగుస్తుంది.