Anna Canteens: ఈనెల 18న అనంతపురంలో మరికొన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభం
Andhra Pradesh News | వైసీపీ హయాంలో అన్నా క్యాంటీన్లు మూతపడగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మళ్లీ వాటిని పున: ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు.
అనంతపురం జిల్లా: వైసీపీ ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లకు కూటమి ప్రభుత్వంలో మోక్షం కలుగుతోంది. పేదలకు తక్కువ మొత్తానికి అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్నపూర్ణ లాంటిది అన్నా క్యాంటీన్. కానీ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్నా క్యాంటీన్లను మూసివేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా.. వాటి స్థానంలో వైఎస్సార్ క్యాంటీన్, ఇతర ఏదైనా క్యాంటీన్ పేరుతో గానీ భోజనం పెట్టే ప్రయత్నం చేయకపోవడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాని ప్రభావం కనిపించిందని రాష్ట్ర వ్యాప్తంగా వినిపించింది.
అనంతపురం నగరంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లను మళ్లీ తెరవబోతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఈనెల 18వ తేదీన అనంతపురం లో మూడు అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఓల్డ్ టౌన్ లోని గుత్తి రోడ్డు లో ఒక అన్న క్యాంటీన్, రైల్వే స్టేషన్ వద్ద ఒక అన్న క్యాంటీన్, బళ్లారి బైపాస్ లో మరో క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే క్యాంటీన్లకి సంబంధించిన అన్ని పనులు పూర్తయినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి ఆకలి తీర్చడమే అన్నాక్యాంటీన్ ఉద్దేశం అని తెలిపారు. నగరానికి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది కూలీలు వస్తుంటారని.. అలాగే ఎక్కువమంది ఆకలితో ఇబ్బంది పడుతుంటారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు రూపాయలకే వారికి నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో ఈ క్యాంటీన్లను గత టిడిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారన్నారు.
అయితే వైసిపి కక్ష సాధింపులో భాగంగా.. టిడిపికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఆ క్యాంటీన్లను రద్దు చేశారన్నారు. అప్పుడు నిర్మించిన అన్న క్యాంటీన్లన్నీ శిథిలావస్థకు చేర్చారన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని ప్రారంభిస్తామని చెప్పామని.. ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. 18వ తేదీన మూడు క్యాంటీన్లను ప్రారంభిస్తామని... రానున్న రోజుల్లో ఇంకా అవసరం ఉన్న చోట కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు.
Also Read: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే