AP SSC Exam: పదో తరగతి ఎగ్జామ్ పేపర్ లీక్‌పై ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన- వాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరిక
పదోతరగతి పరీక్ష ప్రారంభమైన తొలి రోజే అధికారులకు షాక్ ఇచ్చారు కొందరు వ్యక్తులు, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నా పత్రాన్ని సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో గందరగోళం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకైందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. లీక్ వదంతులపై విద్యాశాఖ ఓ వివరణ ఇచ్చింది. పేపర్ లీక్ ప్రసక్తే లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఉదయం 9.30కి పరీక్ష ప్రారంభమైతే 11 గంటలకు సోషల్ మీడియాలో ప్రశ్నాపత్నం సర్క్యులేట్ అయిందని వివరణ ఇచ్చారు. అందుకే దీన్ని లీక్ అనడానికి అవకాశమే లేదన్నారు.
కొందరు ఉద్దేశపూరకంగానే లీక్ చేసినట్టు తెలుస్తోందన్న సురేష్ కుమార్...వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశ్నాపత్రం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె స్కూల్ నుంచి లీక్ అయినట్టు గుర్తించామన్నారు సురేష్. పేపర్ లీక్ చేసిన వారితోపాటు పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్‌వైజర్, ఇన్విజిలేటర్‌పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
పదో తరగతి ప్రశ్నా పత్నం లీక్ చేసిన వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. లీక్‌ల సమస్యల్లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని సూచించారు. ఉదయం పరీక్ష ప్రారంభమైన కాసేపటికే లీక్‌ల వదంతులు విస్తృతంగా వ్యాపించాయి. నంద్యాలతోపాటు చిత్తూరు జిల్లాలో కూడా పేపర్ లీక్ అయినట్టు ప్రచారం జరిగింది.
చిత్తూరులో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే వాట్సాప్ గ్రూపులో తెలుగు ప్రశ్నా పత్రాలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఉలిక్కి పడ్డ అధికార యంత్రాంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ స్పందించారు. చిత్తూరు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, విద్యార్థులు చక్కగా పరీక్ష రాస్తున్నారని, పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందని డీఈఓకు సమాచారం అందిన మేరకు డీఈఓ జిల్లా ఎస్పికి ఫిర్యాదు చేశారని ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎవరూ వదంతులు నమ్మవద్దని చిత్తూరి జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ కోరారు.