Chandrababu : నేను రౌడీలకే రౌడీ, తరిమి తరిమి కొట్టిస్తా- వైసీపీపై చంద్రబాబు ఫైర్
Chandrababu : రాష్ట్రంలో భూకబ్జాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందని చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు.

Chandrababu : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలులో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం గాయత్రి ఎస్టేట్ పార్టీ కార్యాలయంలోని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టిడ్కో ఇళ్లను కేటాయించామని, ప్రస్తుతం ఆ ఇళ్లు ఎలా ఉన్నాయి వాటి పరిస్థితులను బాధితులను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు నగరం తాండ్రపాడు సమీపంలో ప్రభుత్వ పరిధిలో 76 ఎకరాల చెరువు ఉందని స్థానికులు తెలిపారు. కొడుమూరుకు చెందిన ఎమ్మెల్యే, ఇతర వైసీపీ నేతలు చెరువును కబ్జా చేసి దాదాపు రూ.300 కోట్ల దండుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో భూకబ్జాలకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ మారిందన్నారు. భూగర్భ జలాలు కాపాడుకొని 10 గ్రామాలకు జీవనాధారంగా మారినటువంటి చెరువులను కబ్జా చేస్తున్న నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీవ్ర స్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు.
చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత
తమ గ్రామానికి తాగునీటి సౌకర్యంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఈ చెరువు ఉపయోగపడుతూ ఉండేదని, అటువంటి చెరువులను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి అనాధికారికంగా వెంచర్లు వేస్తున్నారని గ్రామస్తులు చంద్రబాబుకు తెలిపారు. ఇటువంటి చెరువుల విషయంలో ప్రభుత్వ అధికారులు తనకి అనాధికారికంగా వారికి వత్తాసు పలికే తమ ఉద్యోగాలకు హాని కలిగేలా చేసుకోవద్దని చంద్రబాబు హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. న్యాయవాదులు గో బ్యాక్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. న్యాయవాదుల నిరసనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసులు అదుపు చేయలేకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. వైసీపీ నేతలు గూండా రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ఆఫీస్ వద్ద మాట్లాడుతున్న చంద్రబాబును న్యాయవాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. చంద్రబాబు రాయలసీమ ద్రోహీ, గో బ్యాక్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అయితే న్యాయవాదులు, వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.
సీఎం జగన్ రాయలసీమ ద్రోహి
"గూండాలందరినీ హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండాలి. దాడులకు పాల్పడిన వారిని తరిమి తరిమి కొడతాం. పోలీసుల వల్ల కాకపోతే చెప్పండి నేను వస్తా. తమాషా అనుకున్నారా వైసీపీ చోటామోటా రౌడీలు ఇలా దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఏంచేస్తున్నారు. బట్టలిప్పించి కొట్టిస్తా దద్దమ్మలారా? పనికిమాలిన వ్యక్తుల్లారా నేరాలు-ఘోరాలు చేసిన దరిద్రులారా అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రౌడీలకు రౌడీని గుర్తు పెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సహనం పాటిస్తున్నాం. మా కార్యకర్తలకు పిలుపునిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే మీ జగన్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేవాడా?.ఎవడ్రా రాయలసీమ దోహి, రాయలసీమను రత్నాల సీమను చేసాం. రాయలసీమకు ద్రోహం చేసింది జగన్. " - చంద్రబాబు
తరిమి తరిమి కొట్టిస్తా
"టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడతారా? కుప్పంలోనూ ఇలానే దాడికి పాల్పడ్డారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే మీరు రోడ్లపై తిరిగేవారా?. విశాఖలో ఉత్తరాంధ్ర వాసుల మధ్య చిచ్చుపెట్టారు. ఇప్పుడు రాయలసీమలో గొడవలు పెడుతున్నారు. నా పర్యటనలో రాళ్ల దాడులు చేస్తున్నారు. పోలీసుల వ్యవస్థ నాశనం అయింది. అందుకే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. సీఎం జగన్ మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. వైసీపీ గూండాలు గుర్తుపెట్టుకోండి తరిమి తరిమి కొట్టిస్తాను. మర్యాదకు మర్యాద దెబ్బకు దెబ్బ. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు నా ప్రాణం పోయినా పర్లేదు. నన్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. " - చంద్రబాబు





















