KRMB GRMB Meet: కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం... భేటీలో కీలక అంశాలపై చర్చ
కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు ఉమ్మడి సమావేశం ఇవాళ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది.
LIVE
Background
కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు ఉమ్మడి సమావేశం హైదరాబాద్ లోని జలసౌధలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. ఉమ్మడి సమావేశంలో కేంద్రం జలశక్తి మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజిట్ లోని అంశాలు, వాటి అమలు కార్యచరణపై చర్చిస్తారు. కృష్ణా, గోదావరి నదుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గత నెల 15వ తేదీన గెజిట్ విడుదల చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం స్వాగతించగా, తెలంగాణ తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. సుప్రీంకోర్టు, ఎన్జీటీలలో కేసుల విచారణ కారణంగా ఇవాళ్టి సమావేశానికి హాజరు కాలేమని చెప్పింది. ఉమ్మడి సమావేశాన్ని వాయిదా వెయ్యాలని బోర్డులకు లేఖ రాసింది.
నెలలో గెజిట్ అమలు, కార్యాచరణ పూర్తయ్యే అవకాశం లేదు : KRMB GRMB బోర్డులు
జీఆర్ఎమ్బీ, కేఆర్ఎమ్బీ ఉమ్మడి సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్‌లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఏపీ తెలిపింది. అభ్యంతరాలు లేని ప్రాజెక్టు వివరాలైతే ఇస్తామని, వివరాల సమర్పణకు వారం గడువు కావాలని బోర్డులను కోరింది. నెలలో గెజిట్ అమలు, కార్యాచరణ పూర్తయ్యే అవకాశం లేదని, దీనిపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్ భద్రతపై కేంద్రంతో చర్చిస్తామని జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ ఛైర్మన్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ, జల్‌శక్తి శాఖలతో చర్చిస్తామని బోర్డులు తెలిపాయి.
ముగిసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం ముగిసింది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ అధికారులు హాజరు అవ్వలేదు.
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం ప్రారంభం
హైదరాబాద్ జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం ప్రారంభమయ్యింది. కృష్ణా, జీఆర్‌ఎంబీ ఛైర్మన్ల అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఏపీ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ, ఇంజినీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ సభ్యులు గైర్హజరయ్యారు. భేటీకి హాజరుకాలేమని రెండు బోర్డులకు ఇప్పటికే తెలంగాణ సర్కార్ లేఖలు రాసింది. ఈ లేఖలను బోర్డు ఛైర్మన్లకు అధికారులు అందజేశారు. ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ బోర్డుల పరిధిపై ఇచ్చిన గెజిట్ అమలు, కార్యాచరణ ఖరారుపై చర్చ జరగనుంది.