Kovvada Problem: శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో కొత్త సమస్య - తలలు పట్టుకుంటున్న జనం
అణు విద్యుత్ పరిశ్రమ వద్దే వంటూ పోరాడిన కొవ్వాడ ప్రజలు వింతైన సమస్యతో బాధపడుతున్నారు. ఎప్పుడో వచ్చే ప్రమాదాన్ని ఊహించి పోరాడిన వాళ్లంతా ఇప్పుడు కళ్ల ముందే కనిపిస్తున్న ముప్పును తొలగించలేకపోతున్నారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ... పరిచయం అక్కర్లేని పేరు. అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు సన్నాహాలతో ఈ గ్రామం జాతీయ స్థాయిలో మారుమోగింది. అక్కడి ప్రజల పోరాటంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. అయితేనేం పాలకులు అనుకున్నట్టుగానే వారిని ఒప్పించి అక్కడ అణువిద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రక్రియ స్టార్ట్ చేశారు.
తకు ఎలాంటి ఫ్యాక్టరీలు వద్ద... తమను రైతుల్లా బతకిస్తే చాలని పోరాడిన వాళ్లంతా వెనక్కి తగ్గి అణువిద్యుత్ ఏర్పాటుకు అంగీకరించక తప్పలేదు. దీంతో ప్రభుత్వం భూముల సేకరణ చేపట్టి ఎవరి ఎంత పరిహారం ఇవ్వాలో అంత ఇచ్చింది. అక్కడి నుంచి వారిని వేరే ప్రాంతానికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు అక్కడ సరికొత్త సిత్రాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, వైజాగ్ లాంటి మెట్రో సిటీల్లో కనిపించే రేసింగ్ కల్చర్ ఇప్పుడు కొవ్వాడలో కనిపిస్తోంది. ఇదే అక్కడి ప్రజలకు నిద్రపట్టనివ్వడం లేదు. ప్రశాంతంగా సాగిపోతున్న తమ జీవితాల్లో ఎప్పుడు ఎలాంటి అలజడి రేగుతుందో చెప్పలేకపోతున్నారు అక్కడ జనాలు.
అసలు విషయం ఏంటంటే... అణువిద్యుత్ కేంద్రానికి భూములు ఇచ్చినందుకు భారీగా పరిహారం ఇచ్చింది ప్రభుత్వం. ఇదే అక్కడి కొంతమంది యువతను వక్రమార్గం పట్టేలా చేస్తోంది. వచ్చిన డబ్బులను జాగ్రత్త పరుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి జల్సాలు చేస్తున్నారు యువకులు.
మెట్రో నగరాల్లో కనిపించే రేసింగ్ బైక్‌లు, పార్టీ కల్చర్ ఇక్కడ నిత్య కృత్యంగా మారింది. చీకటి పడితే చాలు యువకులంతా గుమిగూడి రేస్‌లు పెట్టుకుంటున్నారు. పార్టీల పేరుతో మద్యం, ఇతర మత్తుపదార్థాలకు బానిసలుగా మారుతున్నారని అరోపణలు వినిపిస్తున్నాయి.
స్థలం సేకరణతోపాటు యూత్ ప్యాకేజ్ కింద ప్రభుత్వం అందించిన మొత్తంతో ఇక్కడ యువత జల్సాలు చేస్తోంది. దీనికి తోడు అణువిద్యుత్ కేంద్రంలో ఉద్యోగాలు ఇస్తామన్న హామీ కూడా వీరిలో నిర్లక్ష్యానికి బీజాలు వేసింది. అప్పటి వరకు లైఫ్‌ను ఎంజాయ్ చేయాలన్న ధోరణి వారిలో కనిపిస్తోంది.
ఇలా మద్యం మత్తులో ఉంటూ స్పోర్ట్స్ బైక్స్‌లో రేసింగ్ పాల్గొని కొందరు ప్రాణాలు వదులుతున్నారు. హైవే కావడంతో ఆగి ఉన్న లారీను ఢీ కొట్టి తనువు చాలిస్తున్నారు. ఇది ఇప్పుడు కొవ్వా ప్రాంత ప్రజల కడుపుకోతకు కారణమవుతోంది. వేరే ప్రాంతానికి వీలైన త్వరంగా షిప్టు చేయాలని కోరుకుంటున్నారు ఇక్కడి ప్రజలు.
మార్కెట్‌లోకి కొత్త బైక్ వస్తే చాలు కొవ్వాడలో ఎవరో ఒకరు దాన్ని కొంటున్నారు. హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీలో కనిపించని కొన్ని మోడల్స్ ఇక్కడ కొవ్వాడలో కనిపిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే దీనిపై పోలీసులు కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రజలు.
పెద్దలు వారించి అలాంటి వాటికి జోలికి వెళ్లొద్దని చెబుతున్నా వినే పరిస్థితిలో ఇక్కడ యువతరం లేదన్నది కొవ్వాడ ప్రజల వాదన. అందుకే నచ్చినట్టు లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నామన్న అపోహలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వాపోతున్నారు కన్నవారు.
అణువిద్యుత్ ఫ్యాక్టరీలో ఎప్పుడో ప్రమాదం వస్తుందని అనుకొని ఆందోళన చేశామని దాని కంటే ముందే వచ్చిన ముప్పును ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఇక్కడి జనం. ప్రమాదం జరిగినప్పుడల్లా పోలీసులు, స్థానికులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా యువతలో మార్పు రావడం లేదు.