Konda Surekha : వైఎస్ తప్ప ఆ కుటుంబంలో ఎవరితోనూ అనుబంధం లేదు - విజయవాడలో కొండా సురేఖ వ్యాఖ్యలు
కొండా సినిమా ప్రమోషన్ కోసం విజయవాడలో కొండా సురేఖ పర్యటించారు. వైఎస్‌తో తప్ప ఆయన కుటుంబసభ్యులతో ఎలాంటి అనుబంధం లేదన్నారు.
Konda Surekha : వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆయనతో తప్ప మరెవరితోనూ ఆత్మీయత , అనుబంధం లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ స్పష్టం చేశారు. కొండా మురళి బయోపిక్‌గా రూపొందిన కొండా సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా దంపతుల జీవిత చరిత్ర ప్రజలకు తెలిపేందుకు సినిమా తీశామని...ఎన్ని ఒడుడుకులు నిజం జీవితంలో ఎదుర్కొన్నాం అనే విషయాలను ఈ సినిమా ద్వారా బయట ప్రపంచానికి తెలుస్తుందన్నారు. నిజ జీవితంలో నక్సల్ ఉద్యమం, రాజకీయ ప్రయాణం, మా లవ్ స్టోరీ బేస్ చేసుకొని సినిమా తీశారని వెల్లడించారు.
వైఎస్‌తో తప్ప ఇతర కుటుంబసభ్యులతో అనుబంధం లేదు !
కొండా సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తున్నామని ఇందులో రాజకీయం ఏమీ లేదన్నారు. తాము వైఎస్ఆర్ రాజకీయ భిక్షతోనే ఈ స్థితిలో ఉన్నామన్నారు.నేటి రాజకీయాల్లో విలువలు అనేవి లేవని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయని ఆమె విమర్శించారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చెయ్యాల్సి ఉందని అయితే ఇప్పుడు ఆ పరిస్దితులు లేవని అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ కుటుంబాన్ని కలవలేదని చెప్పారు.వైఎస్ఆర్ తోనే తమ కుటుంబానికి అనుంబందం ఉందని,వారి కుటంబ సభ్యులతో రిలేషన్ లేదని వివరించారు. పార్టీకి రాజీనామా చేశాక విజయమ్మ, షర్మిలమ్మతో ఓ కేసు కోర్టు వాయిదాలో మాత్రమే కలిశామన్నారు.
రాహుల్, రేవంత్ నాయకత్వంలో అధికారంలోకి కాంగ్రెస్ !
వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నానని తెలిపారు. కాంగ్రెస్ దేశంలో ,తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వంలో నే తమ పై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. నక్సలైట్లతో కలిసి తెలంగాణ ఉద్యమం చేసిన కెసిఆర్ ఇప్పుడు నక్సలైట్లను అణచివేతకు గురి చేస్తున్నారని అన్నారు.తెలంగాణలో నక్సలైట్లు ఉండి ఉంటే టీఆర్ఎస్ నేతల ఆగడాలు ఉండేవి కావని ఆమె వ్యాఖ్యానించారు. నక్సల్స్ ఉద్యమాలు చేస్తున్నపుడు ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగించ లేదన్నారు.నక్సలైట్ల హయంలోనే తెలంగాణ బాగుండేదని ,కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములను టీఆర్ఎస్, ప్రభుత్వం లాక్కుంటుందని విమర్శించారు.
కొండా చిత్రాన్ని ఆదరించాలని కోరిన సురేఖ !
రాహుల్ ,రేవంత్ నాయకత్వంలో అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. రాం గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో చిత్రాన్నినిర్మించారని ఆమె తెలిపారు. విజయవాడ వంటి నగరంలో కొండా యూనిట్‌కు ఆదరణ లభించటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కొండా ఫ్యామిలిని అందరూ ఆదరిస్తున్నారనేందుకు ఇదొక నిదర్శనంగా పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రల్లో చిత్రాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.దర్శకుడు వర్మ ఈ చిత్రం పై ప్రత్యేకంగా దృష్టి సారించారని, బ్యాక్ డ్రాప్ స్టోరీ బాగుందని ఆమె అభినదించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో ఇలాంటి చిత్రం నిర్మించటం,అది కూడ తమ కుటుంబానికి చెందినది కావటం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.