Flood Affect: ఇప్పటికీ జలదిగ్బంధంలోనే కోనసీమ, వరద నీటిలో ప్రజల పాట్లు!
Flood Affect: కోనసీమ ప్రాంతమంతా ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉంది. వరద నీటిలోనే ఉంటూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండి దొరక్క నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Flood Affect: రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతాలలో వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టిన కోనసీమలో మాత్రం ఇంకా వరద కష్టాలు తీర లేదు. గోదావరి నది పరివాహక ప్రాంతాలలో ఇంకా ముంపు ముప్పులోనే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తమకు తాగేందుకు సరైన నీళ్లు, భోజనం దొరకడం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలకు తాగేందుకు పాలు కూడా దొరకడం లేదంటూ వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. కరకట్టలు కూడా ఎక్కడపడితే అక్కడ బలహీన పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణాన ఏ ఏటిగట్టు కూలిపోతుందో అంటూ భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.
వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలన చేశారు. శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. వరద ప్రభావిత గ్రామాలలో విష సర్పాల బెడద తీవ్రంగా కనిపిస్తుంది. మరోపక్క వ్యాధుల బెడద కూడా అంతే స్థాయిలో ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కోనసీమలో వరద కష్టాలు తలుచుకుంటే చాలు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో వరద బాధితులకు సాయం అందించాలి..
వరద గ్రామాలలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ.వీ.వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు సందర్శించారు. నీళ్లలోనే ఇంటింటా తిరుగుతూ వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆపై కోనసీమ జిల్లాల్లోని వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని అయితే ప్రభుత్వం చేస్తున్న సాయం అరకొరగా ఉంటున్నాయని తెలిపారు. పూర్తి స్థాయిలో వరద బాధితులను ఆదుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ వి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పుగాకులంకలో ఎమ్మెల్సీ పర్యటన..
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వరద ప్రభావిత గ్రామాల్లో కేవలం కొంత దూరమే వెళ్లి పరామర్శించి వస్తున్నారని... సాయం అందించడంలో కూడా శివారు ప్రాంతాలలో ఉన్న వారికి సాయం సరిగా అందడం లేదని తెలిపారు. ఈ పరిస్థితిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ వెంకటేశ్వర రావు అన్నారు. వరదల్లో నీట మునిగిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం ప్రభుత్వం నుంచి అందించాలని వారు డిమాండ్ చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ.పోలవరం మండలం పుగాకులంకలో వరద బాధితులతో మాట్లాడారు.
ఎక్కడ చూసినా వరద బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో వారికి నాణ్యమైన భోజనం, మంచి నీళ్లు, చిన్న పిల్లలకు పాలు కూడా దొరకడం లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యలను తీర్చాలని.. ఎమ్మెల్సీ వెంకటేశ్వర రావు కోరారు.