Kakani Govardhan Reddy bail: అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ - అన్ని కేసుల్లోనూ రిలీఫ్ - ఇక విడుదలే
Kakani Bail: కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఆయన విడుదల కానున్నారు.

Kakani Govardhan Reddy has been granted bail: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిది. పొదలకూరు మండలం తాటిపర్తిలో రుస్తుం మైన్స్‌లో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణిని A4గా చేర్చారు. ఈ కేసులో చాలా కాలం పరారీలో ఉన్న ఆయనను కేరళలో అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన జైలుకు వెళ్లక తప్పలేదు.
తాటిపర్తిలో రుస్తుం మైన్స్‌లో అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు జరిగాయని, లీజు సమయం ముగిసిన తర్వాత కూడా 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్‌ను తరలించారని మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 16, 2025న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో కూడా కాకాణికి బెయిల్ మంజూరైంది. ఇక కృష్ణపట్నం పోర్టు వద్దఅనధికార టోల్‌గేట్ ఏర్పాటు చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది. తహసీల్దారు డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది.
నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, గిరిజనులను బెదిరించారని మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలలో పేలుడు పదార్థాలను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించారని ఆరోపణలపై కేసు నమోదైంది. వెంకటాచలం సీఐ సుబ్బారావు, ఆర్‌ఐ రవిని బెదిరించారని, కేసు విచారణను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలతో వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో 2024 డిసెంబర్ 27న కేసు నమోదైంది. ఈ కేసు కాకాణి అనుచరుడు మందల వెంకట శేషయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంబంధం కలిగి ఉంది. కాకాణి వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.
అలాగే కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో 2025 జనవరి 22న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సందర్భంలో కాకాణి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకుడు వంటేరు ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై IPC సెక్షన్లు 224, 351/2, 352, 353/2 కింద కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2025 మే 25న అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకూ అన్ని కేసుల్లోనూ ఆయన బెయిల్తెచ్చుకున్నారు. ఆగస్టు 18న, చివరి కేసు అయిన అక్రమ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది, దీంతో ఆయన అన్ని కేసులలో బెయిల్ పొందారు. ఇప్పుడు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
కాకాణి గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించారు.





















