Jagan On Babu Pawan : లారీ ఎక్కి తిడుతున్నాడు - పవన్, చంద్రబాబుపై జగన్ విమర్శలు !
అమ్మఒడి పథకం బటన్ నొక్కే సభలో పవన్, చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారు. వారాహిని లారీతో పోల్చారు.
Jagan On Babu Pawan : అమ్మఒడి పథకానికి బటన్ నొక్కే సభలో పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ వాహనాన్ని లారీతో పోల్చారు. దత్తపుత్రుడు.. ప్యాకేజీ స్టార్ ఇప్పుడు ఓ లారీ ఎక్కాడు. వారాహి అనే లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడని మండిపడ్డారు. దత్తపుత్రుడిలా మనం బూతులు తిట్టలేం.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేమని చెప్పుకొచ్చారు. పెళ్లి అనే బంధాన్ని రోడ్డుపైకి తీసుకురాలేం. ఇవన్నీ దత్తపుత్రుడికే పేటెంట్ అని విమర్శించారు. టీడీపీ అంటే తినుకో.. దోచుకో .. పంచుకో అని పేరు చెప్పారు.
ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే.. చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అబద్ధాలు.. మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నాడని మండిపడ్డారు. తన 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదు. టీడీపీని టీ అంటే తినుకో.. డీ అంటే దండుకో.. పీ అంటే పంచుకోగా మార్చేశారు. దోచుకున్న సొమ్ముతో వాళ్లు బొజ్జలు పెంచుకున్నారని ఆరోపించారు. మన రాష్ట్రంలో మంచిచేయొద్దని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయి. మంచి అనోద్దు.. మంచి వినోద్దు..మంచి చేయొద్దు అన్నదే వారి విధానం. నమ్మించి ప్రజలను నట్టేటా ముంచడమే వాళ్లకు తెలిసిన నీతి. రాష్ట్రంలో మంచి జరుగుతుంటే భరించలేకపోతున్నారు. వాళ్లకు కడుపులో మంట, ఈర్ష్యతో వాళ్లకు కళ్లు మూసుకుపోయాయన్నారు.
దత్తపుత్రుడు 2014లోనూ చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు. మరి ఆ తర్వాత చంద్రబాబు చేసిన మోసాన్ని ఎందుకు నిలదీయలేదు. ఆ దత్తపుత్రుడు.. మామూలుగా మాట్లాడడు. ఆ ప్యాకేజీ స్టార్ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని.. చెప్పుతో కొడతానంటాడు. తాట తీస్తానంటాడు. ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆ మనిషి నోటికి అదుపు లేదు.. నిలకడా లేదు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేం. అవన్నీ వారికి చెందిన పేటెంట్ అన్నారు.
దుష్టచతుష్టయం సమాజాన్ని చీల్చుతోంది. కానీ, మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి. అందుకే పనికి మాలిని పంచ్ డైలాగులు ఉండవ్. బలమైన, పటిష్టమైన పునాదుల మీద నిలబడ్డాం. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలులో మన పునాదులు ఉన్నాయి. పేదల కష్టాల నుంచి మన పునాదులు పుట్టాయి. మన పునాదులు ఓదార్పు యాత్ర నుంచి పుట్టాయి. వాళ్ల మాదిరిగా వెన్నుపోటు, అబద్ధాలపై మన పునాదులు పుట్టలేదు. రాష్ట్రంలో రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామని యుద్ధంలో వారి మాదిరిగా మనకు దత్తపుత్రుడు లేడు. అబద్ధాలను పదే పదే చెప్పి భ్రమ కలిగించే మీడియా లేదన్నారు. రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. మీ బిడ్డ తోడేళ్లను నమ్ముకోలేదు.. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. జరగబోయే కురుక్షేత్రంలో మీ బిడ్డకు మీరే అండగా ఉండాలని పిలుపునిచ్చారు.