Sankranti Trains: హాట్ కేకుల్లా సంక్రాంతి ట్రైన్ టికెట్లు, అన్నీ వెయిటింగ్ లిస్ట్‌లే !
Sankranti Trains: సంక్రాంతి రైళ్లకు ఉండే డిమాండే వేరు. ఉపాధి, ఉద్యోగ అవసరాల దృష్యా దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.
Sankranti Trains: సంక్రాంతి రైళ్లకు ఉండే డిమాండే వేరు. ఉపాధి, ఉద్యోగ అవసరాల దృష్యా దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. అప్పటికప్పుడు టికెట్లు దొరకవు. అందుకే నాలుగు నెలల ముందే సొంత ఊర్లకు వెళ్లేందుకు టికెట్లు ట్రైన్ టికెట్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు విడుదల అవుతాయో అప్పుడే బుక్ అయిపోతుంటాయి. ఈ సారి కూడా పండుగకు 120 రోజుల ముందే సీట్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. పలు రైళ్లలో అప్పుడే వెయిటింగ్ లిస్ట్ (WL) జాబితా దర్శనమిస్తోంది. కొన్ని రైళ్లలో అయితే అప్పుడే ‘రిగ్రెట్’ (REGRET) అని కూడా చూపిస్తోంది.
ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. అంతే కాదు చాలా ట్రైన్లలో ‘రిగ్రెట్’ అని చూపిస్తోంది. రైలు టికెట్లను 120 రోజుల ముందుగా బుక్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో టికెట్లు అందుబాటులోకి రాగానే హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. సంక్రాంతి ప్రయాణానికి టికెట్లు అందుబాటులోకి రాగానే ఎగబడి కొనుగోలు చేశారు. ఇక టికెట్లు దొరకని వారు రైల్వే శాఖ నడిపే ప్రత్యేక రైళ్లు, ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు నడిపే ప్రత్యేక బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిందే.
సంక్రాంతి పండగకు ఏపీలోని రాజమండ్రి, కాకినాడ, నరసాపురం వైపు రద్దీ ఎక్కువగా ఉంటుంది. మెట్రో నగరాలు పుణె, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాల్లో ఉన్నవాళ్లు సైతం సంక్రాంతి పండగకు సొంతూళ్లకు పయమనమవుతుంటారు. దీంతో మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్ మీదుగా ఒడిశా, బెంగాల్‌కు వెళ్లే రైళ్లలోనూ, బెంగళూరు, చెన్నై మీదుగా ఉత్తరాంధ్ర వైపు వెళ్లే రైళ్లలో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. దీంతో పండుగకు ఇబ్బందులు లేకుండా ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆయా తేదీలకు పెరిగిన డిమాండ్
వచ్చే ఏడాది జనవరి 13, 14, 15 తేదీల్లో బోగీ, సంక్రాంతి, కనుమ పండగలు జరుగుతాయి. 13వ తేదీ శనివారం కావడంతో 12వ తేదీ ప్రయాణానికి అధిక డిమాండ్ ఏర్పడింది. 10, 11 తేదీల్లోనూ చాలా రైళ్లలో టికెట్లు అందుబాటులో లేవు. సినిమా అప్పుడే అయిపోలేదు. పండగ తరువాత కూడా ఇదే పరిస్థితి ఏర్పడనుంది. సెలవులు ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణం ఇంకా నరక ప్రాయంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. మరో రెండ్రోజుల్లో తిరుగు ప్రయాణానికి టికెట్లు అందుబాటులోకి రానున్నాయని వాటిలోనైనా సీట్లు దొరుకుతాయో లేదో ననే సందేహంలో ప్రయాణికులు ఉన్నారు.
ఈ రైళ్లలో సీట్లు లేవు
సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ (12728) రైలుకు అప్పుడే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. స్లీపర్‌లో జనవరి 10వ తేదీకి 100 కుపైగా, 11వ తేదీన 280కి పైగా వెయిటింగ్ లిస్ట్ ఉంది. 12వ తేదీ ‘రిగ్రెట్’ చూపిస్తోంది. 13వ తేదీ సైతం 290పైనే వెయిటింగ్ లిస్ట్ ఉంది. థర్డ్ ఏసీలోనూ 10వ తేదీకి 23 వెయిటింగ్ లిస్ట్ ఉండగా.. 11వ తేదీ 86, 12వ తేదీ 269 వెయిటింగ్ లిస్ట్ ఉంది. 13వ తేదీ సైతం 104 వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. అదే రూట్లో నడిచే గరీబ్ రథ్ రైలు (12740) పరిస్థితి కూడా ఇంతే. పదో తేదీ 130కిపైగా, 11వ తేదీ 250పైగా వెయిటింగ్ లిస్ట్ ఉంది. 12, 13 తేదీల్లో ప్రయాణానికి రిగ్రెట్ అని చూపిస్తోంది.
సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమాలోనూ 10, 11 తేదీల్లో స్లీపర్ క్లాస్ ప్రయాణానికి వెయిటింగ్ లిస్ట్ జాబితా 200 పైనే ఉంది. 12వ తేదీ ప్రయాణానికి రిగ్రెట్ అని చూపిస్తోంది. 13వ తేదీ 300పైగా వెయిటింగ్ లిస్ట్ చూపుతోంది. విశాఖ ఎక్స్‌ప్రెస్, దురంతో, నాందేడ్, కోణార్క్, ఈస్ట్‌కోస్ట్ రైళ్లలోనూ ఇదే పరిస్థితి. సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ రైలులో 12వ తేదీ ప్రయాణానికి వెయిటింగ్ లిస్ట్ జాబితా చూపిస్తోంది. మిగిలిన రోజుల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. సంక్రాంతి వచ్చిందంటే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. పండుగ రద్దీ దృష్ట్యా ఏటా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా, అందులో సరైన సౌకర్యాలు ఉండడం లేదు.