BJP Kiran Entry : పార్టీలో చేరగానే కిరణ్ యాక్టివ్ - బుధవారం నుంచే కార్యచరణ ! ఏంచేయబోతున్నారంటే?
ఏపీ బీజేపీని కిరణ్ రెడ్డి ఎలా ముందుకు నడిపిస్తారు ? బుధవారం నుంచే కార్యాచరణ ప్రారంభిస్తున్నారా ?
BJP Kiran Entry : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత తొలి సారిగా విజయవాడ వస్తున్నారు. బుధవారం ఆయన విజయవాడలోని బీజేపీ కార్యాలయానికి రానున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో బీజేపీ తరపున కీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హపార్టీ హైకమాండ్ కూడా ఈ విషయంలో ఆయనకు ఓ స్పష్టత ఇచ్చిందని చెబుతున్నారు. కిరణ్ రెడ్డి రాక సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించాలని కూడా బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటి దాకా ఓ లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా రాజకీయాలు చేస్తామని బీజేప నేతలంటున్నారు.
బీజేపీ తరపున వెంటనే రంగంలోకి కిరణ్ రెడ్డి
కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినా ఆయన సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. దాదాపుగా ఎనిమిదేళ్ల పాటు ఆయన తెరపైకి రాలేదు. ఈ మధ్య కాలంలో ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినా ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఎలాంటి పదవి లభించలేదు. పార్టీ కోసం పని చేయడానికి అవకాశం కల్పించలేదు. టీ పీసీసీ చీఫ్ ను మార్పు చేయాలనుకున్నప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డిని యాక్టివ్ చేయలేదు. దాంతో ఇప్పుడు కిరణ్ రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ ద్వారానే యాక్టివ్ పాలిటిక్స్‌లో అడుగుతున్నారని అనుకోవచ్చు.
ఏపీలో బీజేపీ బలోపేతంపైనే ప్రత్యేకంగా దృష్టి
కిరణ్ కుమార్ రెడ్డి సేవలను కర్ణాటకలో కూడా వాడుకోవాలని బీజేపీ అధిష్ఠానం అనుకున్నప్పటికీ ప్రాథమికంగా ఏపీలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీలో చేరిక సమయంలో పెద్దగా హడావుడి లేకుండా రాష్ట్ర నేతలు ఎవరూ రాకుండానే బీజేపీలో చేరిపోయారు. కానీ కిరణ్ విజయవాడ రాక సందర్భంగా బీజేపీ నేతలంతా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు అందరూ కల్సి పని చేయాలని నిర్ణయించుకునే అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎంగా చేసినందున పార్టీలో జాతీయ స్థాయి పదవి ఇస్తారని కానీ ఏపీపై ఆయన ముద్ర ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు.
కిరణ్ రెడ్డి ఏపీ బీజేపీ రాత మార్చేస్తారా ?
కారణం ఏదైనా బీజేపీ ఏపీలో అనుకున్నంగా ఎదగలేకపోతోంది. వలస నేతలు వచ్చినా పరిస్థితి మారలేదు. కన్నా లక్ష్మినారాయణ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉండి బీజేపీలో చేరారు. ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సూపర్ విజన్‌లో ఏపీ బీజేపీ బలం పుంజుకునేదిశగా ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నారు. కిరణ్ రెడ్డి బీజేపీలో చేరికపై ఎవరకీ అభ్యంతరాలు లేవు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఆయన సలహాలు పాటించడానికి సిద్ధంగా ఉంటారు. ఎలా చూసినా బీజేపీ.. కిరణ్ రెడ్డి ఆలోచనలతో ఓ ప్రయోగం చేస్తుందని.. అది విజయవంతం అవుతుందని గట్టి ఆశలు పెట్టుకుంటున్నారు.