Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో 6, తెలంగాణలో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Weather Report: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలో 6, తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Latest Weather Report In AP And Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది శనివారం అర్ధరాత్రి విశాఖ - గోపాల్‌పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తోన్న ఎడతెరిపి లేని వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపైకి భారీగా నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని (Andhrapradesh) 6 జిల్లాలకు, తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే 3 రోజులు ఏపీలోని ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, ఏలూరు, అల్లూరి మన్యం, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అటు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, విశాఖ, కృష్ణా, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలోని 9 జిల్లాలకు
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని (Telangana) 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజులు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటలకు 40 నుంచి 50 కిలో మీటర్ల వరకూ ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు తాకొద్దని అధికారులు హెచ్చరించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చెయ్యొద్దని పేర్కొన్నారు.
నలుగురు మృతి
అటు, భారీ వర్షాలతో విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సమీపంలోని ఇళ్లపై కొండ చరియలు విరిగిపడగా ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లోని స్థానికులను ఖాళీ చేయిస్తున్నారు. ఘటనలో ఓ ఇళ్లు ధ్వంసం కాగా.. మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. కిందిస్థాయి నుంచి ప్రతి ఒక్క సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వాగులు, చెరువుల పరిస్థితిని సమీక్షించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరుతున్న క్రమంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఏజెన్సీల్లో జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను నిరంతరం మానిటర్ చేయాలని చెప్పారు.
Also Read: Pensions: భారీ వర్షంలో పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు - సచివాలయ సిబ్బందికి సీఎం చంద్రబాబు వెసులుబాటు