Pensions: భారీ వర్షంలో పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు - సచివాలయ సిబ్బందికి సీఎం చంద్రబాబు వెసులుబాటు
CM Chandrababu: రాష్ట్రంలో భారీ వర్షాల క్రమంలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీపై శనివారం కీలక ఆదేశాలిచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఒకటి రెండ్రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని వెసులుబాటు కల్పించారు.
CM Chandrababu Key Orders On Pensions Distribution: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న క్రమంలో కొన్ని చోట్ల పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సచివాలయ సిబ్బంది శనివారం ఉదయం నుంచే లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. ఈసారి సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ 56 శాతం పింఛన్ల పంపిణీ పూర్తైంది. కొన్నిచోట్ల వానలు కురుస్తున్నా సిబ్బంది ఇబ్బందులు పడుతూనే పంపిణీ కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రమాదాలకు గురవుతున్నారు.
గుంటూరు జిల్లాలో భారీ వర్షంలో పెన్షన్ పంపిణీ కోసం వెళ్తుండగా ఓ సచివాలయ ఉద్యోగిని బైక్ అదుపు తప్పి కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని చోట్ల వరదల్లో సెల్ ఫోన్స్, డివైస్‌లు నీటిలో జారి పడుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా జోరుగా వర్షం పడుతుండడంతో పింఛన్ పంపిణీలో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో ఇబ్బందికర పరిస్థితులున్నా అధికారులు మాత్రం టార్గెట్ పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని.. అరగంటకోసారి ఆన్లైన్ ద్వారా పింఛన్ పంపిణీ రిపోర్ట్ తనిఖీ చేస్తూ సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీకి కాస్త టైం ఇవ్వాలని ఉద్యోగులు అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు సచివాలయ శాఖ ద్వారా ఆదేశాలివ్వాలని కోరుతున్నారు.
సీఎం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలతో పింఛన్లు పంపిణీ చేసేందుకు సిబ్బంది ఇబ్బంది పడుతున్న వేళ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు కురిసే ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు. వర్షాలతో ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే ఒకటి రెండ్రోజుల్లో పంపిణీ పూర్తి చెయ్యొచ్చని అన్నారు. ఈ విషయంలో సిబ్బందికి ఎలాంటి టార్గెట్ ఇవ్వొద్దని, వారిపై ఒత్తిడి తీసుకురావొద్దని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా పంపిణీ పూర్తి చేయాలని సూచించారు.
కొత్త పింఛన్లపై కీలక ప్రకటన
మరోవైపు, కొత్త పింఛన్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 2 నుంచి అర్హులకు కొత్త పింఛన్లు ఇస్తామని.. అనర్హుల పింఛన్లు తొలగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. అటు, రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. భారీ వర్షాలు కురుస్తోన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ చేపట్టారు.
Also Read: CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష - అధికారులకు కీలక ఆదేశాలు