Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Virus Attack: ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, విశాఖ ప్రాంతాల్లో కాక్సాకీ వైరస్ కేసులు మళ్లీ కనపడుతున్నాయి. ఈ వైరస్ ద్వారా హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ప్రబలుతోంది.
Andhra Pradesh News: ఓవైపు ఎం పాక్స్(M-pox) అంటూ దేశవ్యాప్తంగా మళ్లీ కలవరం మొదలైన వేళ.. ఏపీలోని మూడు జిల్లాల్లో కాక్సాకీ(Coxsackie virus) వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రతి ఏటా ఈ వైరస్ కి సంబంధించిన కేసులు అక్కడక్కడ బయటపడుతూనే ఉంటాయి. ఈసారి మళ్లీ ఈ సీజన్ మొదలైంది. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైరస్ కేసులు ఎక్కువగా కనపడుతున్నాయి. అటు విశాఖ ప్రాంతంలో కూడా కాక్సాకీ వైరస్ బారినపడిన చిన్నారులు ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు.
కాక్సాకీ వైరస్ తో హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వస్తుంది. ఇది ముఖ్యంగా చిన్నారుల్లో కనపడుతుంది. రోజుల వయసున్న పిల్లలతో పాటు 10 ఏళ్ల లోపు ఉన్న వారిని కూడా కాక్సాకీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. దీని ద్వారా వచ్చే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ద్వారా పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్.. ఆ పేరులోనే దాని పరిధి ఏంటో తెలిసిపోతుంది. చేతిపై, కాళ్లపై, గొంతులో దద్దుర్లు రావడం, పొక్కులు లేవడం దీని లక్షణాలు. అలా వచ్చిన పొక్కులు, పుండ్లుగా మారి మరింత ఇబ్బంది పెట్టే స్టేజ్ కి చేరుకుంటాయి. ఈలోగా దాన్ని గుర్తించి సరైన వైద్యం తీసుకోవడం మంచిది. ఒకవేళ వైద్యం తీసుకోకపోతే ఎక్కువరోజులపాటు ఆ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది. అరుదుగా మాత్రమే ఇది ప్రాణాంతకం అని వైద్యులు చెబుతున్నారు.
తేమ, వేడి ఎక్కువగా ఉన్న ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ. దీని ద్వారా వ్యాప్తి చెందే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ప్రబలుతుంది. ఇదేమీ సీజనల్ వ్యాధి కాదు. దాదాపుగా అన్ని సీజన్లలోనూ ఈ వైరస్ ఉనికి ఉంటుంది. శరీర రంగునిబట్టి కురుపులు ఎక్కువగా ఉన్నట్టు కనిపించవచ్చు. కానీ ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. వయసు పెరిగేకొద్దీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి పదేళ్ల వయసు దాటిన వారిలో ఈ వ్యాధి కనిపించదు. మూడు రోజులనుంచి ఆరు రోజుల వరకు పొక్కులు కురుపులు కనపడతాయి. ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కొంతమంది పిల్లల్లో నోటి వెనక, గొంతులో కూడా ఈ పొక్కులు వస్తాయి. ఇలా వస్తే పిల్లలు ఎక్కువ బాధపడతారు. దీన్ని హెర్పాంజియా అంటారు. కొంతమందిలో ఇది మెదడువాపుకి కూడా దారి తీసే అవకాశముంది.
కాక్సాకీ వైరస్ ఒకరినుంచి మరొకరికి ఉమ్ము, చీమిడి, పుండ్ల నుంచి వచ్చే రసిక ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన పిల్లలు బడికి వస్తుంటే తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారికి వారం రోజులపాటు విశ్రాంతి తీసుకునే అవకాశమివ్వాలి. మిగతా పిల్లలు ఈ వ్యాధిబారిన పడకుండా పరిశుభ్రమైన అలవాట్లు నేర్పాలి. వ్యాధినయమైన తర్వాత కూడా కొన్నిరోజులపాటు ఈ వైరస్ శరీరంలనే ఉండి ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ఇలాంటి టైమ్ లో పిల్లలు వైరస్ సోకకుండా పరిశుభ్రంగా ఉండాలి. అరుదుగా మాత్రమే ఇది పిల్లలనుంచి పెద్దవారికి సోకుతుంది.
దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏదీ లేకపోయినా.. వైరస్ తీవ్రతనుబట్టి సింప్టమేటిక్ ట్రీట్ మెంట్ అవసరం ఉంటుందని వైద్యులు అంటున్నారు. సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గించడానికి పారాసెట్మాల్ వాడతారు. నోటిపై పొక్కులు రావడంతో పిల్లలు ఆహారం తక్కువగా తీసుకుంటారు, నీరు కూడా తాగలేదు. అలాంటి సమయాల్లో వైరు డీహైడ్రేడ్ కాకుండా చూసుకోవాలి.
ఇక వ్యాధి రాకుండా ఉండాలంటే మాత్రం ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లల ఆటవస్తువులను కలవనీయకూడదు. చుట్టుపక్కల వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. తరచూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలకు కాచి చల్లార్చిన నీటినే తాగడానికి ఇవ్వాలి. ఇంటి పరిసరాల్లో పిల్లల డైపర్లు ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఉండాలి.
ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, విశాఖ ప్రాంతాల్లో ఈ కేసులు మళ్లీ కనపడుతున్నట్టు తెలుస్తోంది. నివారణ కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మేలు అని సలహా ఇస్తున్నారు వైద్యులు. అన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కాకపోయినా పిల్లలను తీవ్రంగా ఈ వ్యాధి బాధపెడుతుంది.
Also Read : వానల్లో, వరదల్లో తిరుగుతున్నారా? అయితే జాగ్రత్త.. మాంసాన్ని తినేసే బాక్టీరియా సోకొచ్చు.. విజయవాడలో ఏమైందంటే