Perni Nani : సినిమా పెద్దల సూచనలతోనే ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాలు - ఏపీ సర్కార్ క్లారిటీ
ప్రభుత్వమే ఆన్ లైన్ టిక్కెట్లను అమ్మాలని తీసుకున్న నిర్ణయంపై వస్తున్న విమర్శలపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పెద్దల సూచనల వల్లే ఆ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.
సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మాలన్న ఐడియా సినీ ప్రముఖులదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారా, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. గత నెల 31న ఏపీ ప్రభుత్వం రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఉన్న ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ తరహాలో ఏపీలో ఉన్న సినిమాహాళ్లు మొత్తానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఓ పోర్టల్ రూపొందించాలని నిర్ణయిస్తూ జీవో జారీ చేసింది. విధి విధానాలు ఖరారు చేసేందుకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఐటీ సహా వివిధ విభాగాల నుంచి ఏడుగుర్ని సభ్యులుగా నియమించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఆన్ లైన్ టిక్కెటింగ్ సిస్టమ్ పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు. Also Read : టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ నుంచి పిలుపు... ఈ నెల 20న చిరంజీవి బృందం భేటీ...
అయితే ఈ ఉత్తర్వులపై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం సినిమా టిక్కెట్లను అమ్మడం ఏమిటన్న విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారు. సినిమా టిక్కెట్లను అమ్మాలనే అంశంపై కమిటీలు వేశామని అధ్యయనం జరుగుతోందని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. దీనిపై విపక్ష నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read : మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్... ఎందుకంటే..!
రాష్ట్ర ప్రభుత్వం మంచి పని ఏది చేపట్టినా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మాలని సినీ ప్రముఖులే కోరారని.. సినీ పెద్దల సూచనలే ప్రభుత్వం పరిశీలించిందని స్పష్టం చేశారు. టిక్కెట్ల అమ్మకాల్లో పన్ను ఎగవేత జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం గమనించిందని పేర్ని నాని స్పష్టం చేశారు. అలాగే బ్లాక్ టిక్కెట్లను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. త్వరలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. జగన్ కూడా వారితో త్వరలో సమావేశం అవుతామన్నారు. Also Read : వివాదంలో మహేష్ బాబు.. ఆ ప్రకటనలో నటించడం వల్లే !
కరోనా తర్వాత సినీ పరిశ్రమ ఏపీలో ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదు. మూడు షోలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో చాలా తక్కువ సంఖ్యలో ధియేటర్లను తెరిచారు. టిక్కెట్ రేట్లను కూడా పరిమితం చేయడం ఎగ్జిబిటర్లు కూడా సంతోషంగా లేరు. అదే సమయంలో టాలీవుడ్ పెద్దలు తమ సమస్యలను సీఎంకు చెప్పి పరిష్కారం కనుగొనాలని అనుకున్నారు. అనూహ్యంగా వారి సమావేశం జరగలేదు కానీ టిక్కెట్ల అమ్మకాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఈ అంశాలపై టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. సీఎంతో వారి భేటీ తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read : వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?