Chevireddy assets: చెవిరెడ్డికి భారీ షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం - లిక్కర్ స్కామ్‌లో సంపాదించిన ఆస్తుల జప్తు
Andhra liquor scam: లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంపాదించిన ఆస్తులను జప్తు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

Andhra liquor scam Chevireddy Bhaskar Reddy assets : ఆంధ్రప్రదేశ్స మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో మద్యం వ్యాపారంలో అవినీతి, మోసాలు, కమీషన్ల ద్వారా అక్రమంగా సంపాదించినట్లుగా సిట్ దర్యాప్తులో తేలడంతో, ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న వారి ఆస్తుల జప్తు ప్రక్రియను ప్రారంభించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారులు మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి, కేవీఎస్ ఇన్‌ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ చెవిరెడ్డి లక్ష్మి పేర్లతో ఉన్న ఆస్తుల జప్తునకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు సిట్ దర్యాప్తు నివేదిక మేరకు, అవినీతి నిరోధక చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్) , నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జారీ చేశారు.
మద్యం స్కాం ద్వారా సంపాదించిన ఆస్తుల జప్తు
సిట్ దర్యాప్తులో గుర్తించిన వివరాల ప్రకారం, చెవిరెడ్డి కుటుంబం మద్యం కుంభకోణంలో పాలుపంచుకుని అక్రమంగా భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టింది. ముఖ్యంగా, రూ. 54.87 కోట్ల నల్లధనాన్ని చట్టబద్ధమైన ఆస్తులుగా మార్చినట్లు తేలింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న పలు భూములు, ఆస్తులు, వాణిజ్య భవనాలు వంటివి ఈ కుంభకోణ నిధులతోనే కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. అధికారం అండతో మోసపూరిత భూ లావాదేవీలు, కమీషన్ల ద్వారా సంపాదించిన డబ్బును ఆస్తులుగా మార్చినట్లు సిట్ నివేదికలో స్పష్టం చేశారు. ఈ ఆస్తులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరుతోనే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులు మరియు సంబంధిత కంపెనీల పేర్లతో ఉన్నాయి.
ఇతర నిందితుల ఆస్తులు కూడా జప్తు
ప్రభుత్వం ఈ ఆదేశాలతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పొలీస్ ని తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జప్తు ప్రక్రియ పూర్తి చేసి, ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని, అవసరమైతే కోర్టులో కేసు దాఖలు చేయాలని సూచించింది. ఈ మేరకు హోం శాఖ నుంచి జారీ చేసిన ఉత్తర్వులు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఈ కుంభకోణంలో మరికొంతమంది నిందితుల ఆస్తులను జప్తు చేశారు.
మరికొన్ని ఆస్తులను గుర్తించిన తర్వాత జప్తు చేసే అవకాశం
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా, జగన్ ఆంతరంగీకుడిగా పేరు పొందారు. మద్యం కుంభకోణం ద్వారా రాష్ట్రానికి భారీ నష్టం సంభవించడంతో, దీని నిధులతో కూడబెట్టిన ఆస్తులను రికవర్ చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతగా మారింది. తదుపరి రోజుల్లో ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. చట్టం ప్రకారం.. ఓ నేరం కింద సంపాదించిన ఆస్తులను జప్తు చేయవచ్చు. నేర విచారణలో మనీ ట్రయల్ గా వాటిని చూపించవచ్చు. అయితే చెవిరెడ్డి ఇతర వ్యాపారాలు లేదా.. ఇతర స్కాములు చేసి ఏవైనా ఆస్తులు సంపాదించి ఉంటే వాటిని జప్ుత చేసే అధికారం లేదు. అందుకే లిక్కర్ స్కామ్ లో సంపాదించిన సొమ్ములని మాత్రమే జప్తు చేశారు.





















