కోనసీమకు అంబేడ్కర్ పేరు పెడితే తప్పేంటి? ముద్రగడ బహిరంగ లేఖ
కోనసీమ పెద్దలకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆ ప్రాంత ప్రజలంతా కుల, మతాల చిచ్చులతో గొడవ పడడం చాలా బాధంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కోనసీమలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధ కలిగిస్తున్నాయన్నారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. కోనసీమ పెద్దలకు లెటర్ రాసిన ముద్రగడ... జిల్లా పేరు వివాదానికి త్వరగా ముగింపు పలకాలని హితవు పలికారు. దీన్ని కొనసాగిస్తే ప్రమాదకరమన్నారాయన. ప్రస్తుతం కోనసీమలో జరుగుతున్న కుల, మతాల చిచ్చు తనను కలచి వేస్తుందన్నారు ముద్రగడ.
తాను పెద్ద మేధావిని కాను అన్న ముద్రగడ... పెద్దగా చదువుకోలేదు అని వివరించారు. కానీ ఈ మధ్య కోనసీమలో జరుగుతున్న వరుస సంఘటనల గురించి స్నేహితులు, మీడియా ద్వారా తెలుసుకుని బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలంతా సోదర భావంతో మెలగాల్సిన సమయంలో కులాలు, మతాల కుంపట్లో మగ్గిపోవడం దారుణమని ఆవేదన చెందారు. అందుకే లేఖ రాయాలనిపించిందని ముద్రగడ పద్మనాభం వివరించారు.
మహనీయుడి పేరు జిల్లాకు పెడితే గొడవలెందుకు..
గతంలో ప్రజలు చాలా విషయాల్లో పట్టింపులు, మూఢ నమ్మకాలతో తగాదాలు పడేవారని గుర్తు చేశారు ముద్రగడ. సమాజంలో అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయన్నారు. ఇప్పుడు చూస్తున్న పరిణామాలు చూస్తుంటే మళ్లీ వెనుకటి రోజులకు వెళ్తన్నామేమో అనిపిస్తుందని సందేహపడ్డారు. ప్రపంచం మెచ్చిన అంబేడ్కర్ లాంటి మహనీయుడి పేరు జిల్లాకు పెడితే గొడవలు పడడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. అలాంటి గొప్పవాళ్ల పేరు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పెట్టినా ఎవ్వరూ కాదనలేని పరిస్థితి ఉందని భావిస్తున్నట్టు వివరించారు.
ఏదో ఒక కారణంగా బాలయోగి పేరు పరిగణలోకి తీసుకోలేదన్నారు ముద్రగడ. గతంలో ఆయా జిల్లాలకు ఆ ప్రాంతానికి చెందిన వారి పేర్లు పెట్టారని తెలిపారు. అది మంచి పద్దతే కానీ అలా పెట్టినంత మాత్రాన ఆ జిల్లా వారి ఆస్తిగా మారిపోదన్నారు.
గర్వపడాల్సింది పోయి గొడవలా..
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేయడం న్యాయమంటారా అని ముద్రగడ ప్రశ్నించారు. అలాంటి మహా వ్యక్తి పేరు కోనసీమ ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీలవ్వాలన్నారు. బ్రిటీష్ పాలన సమయంలో కాటన్ దొర ధవళేశ్వరంలో గోదావరికి ఆనకట్ట కట్టించారని.. అందుకు కృజ్ఞతగా అక్కడ ఆయన విగ్రహాలు పెట్టినట్లు తెలిపారు. వేరే దేశస్తుల విగ్రహాలు పెట్టగా లేనిది.. భారత్‌లో పుట్టిన మహనీయుల పేర్లు పెడితే మాత్రం తప్పేంటని అన్నారు. మన దేశంలో పుట్టి, మనందరి కోసం రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ అంబేడ్కర్‌ని గౌరవించడంలో తప్పేమీ లేదన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు తెలిపారు.
అయ్యా.. గొడవలు ఆపండి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ కానిస్టిట్యూషన్ అని చెప్పక తప్పదన్నారు ముద్రగడ. కోనసీమ పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. ఈ సమస్యలకు వెంటనే ముగింపు పలకాలని లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యలు ఇకపై సమసిపోయేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పినిపే విశ్వరూప్, శాసన సభ్యుడు పొన్నాడ సతీష్, కుడుపూడి సూర్యనారాయణ రావు, కల్వకొలను తాతాజీని వేడుకుంటున్నానని ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ లేఖ తన స్వార్థం కోసం రాయలేదని.. కోనసీమ ప్రజలంతా సంతోషంగా ఉండాలనేదే తన కోరికని చెప్పారు ముద్రగడ.