East Godavari: నెత్తురోడిన రోడ్డు... ఎదురెదురుగా బైక్ లు ఢీకొని నలుగురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు నెత్తురోడింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో ప్రమాదంలో ఎస్సై భార్య మరణించారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ఎదురెదురుగా రెండు బైక్ లు ఢీకొని మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం కాల్వ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో ముగ్గురు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందారు. రంపచోడవరం సీఐ త్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం జాగరంపల్లి గ్రామానికి చెందిన కోడి రమేశ్, కోసు శేఖర్‌లు సీతపల్లి గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. గంగవరం మండలం జీఎం పాలెం గ్రామానికి చెందిన చోడి రాజబాబు, పండు అనే ఇద్దరు యువకులు రంపచోడవరం నుంచి సొంత ఊరుకు బైక్ పై వెళ్తున్నారు. ఈ రెండు వాహనాలు ఐ.పోలవరం కాల్వ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శేఖర్, రమేశ్, పండు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన రాజాబాబు రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: వీడియో కాల్‌లో సెక్స్ చాట్ చేస్తున్నారా? అయితే మీ ఖాతాలో డబ్బులు ఖతమ్
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ఎస్సై భార్య మృతి
తీర్థయాత్రకు వెళ్తుండగా అనుకోని ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దైవ దర్శనానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఎస్‌ఐ భార్య ప్రాణాలు కోల్పోయారు. కుటుంబసభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సూర్యారావుపేట సీసీఎస్ ఎస్సై సత్యనారాయణ కుటుంబంతో కలిసి అన్నవరం వెళ్తుండగా ఆదివారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి పంట పొలాలకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఎస్సై సత్యనారాయణ సతీమణి సరోజ తీవ్ర గాయాలతో ఘటనాస్థలిలోనే మృతిచెందింది. ఈ ప్రమాదంలో గాయపడిన మిగిలిన కుటుంబ సభ్యులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: అడుగడుగునా అత్యాచారం.. 6 నెలల్లో బాలికపై 400 మంది.. నిందితుల్లో పోలీసులు కూడా..!
Also Read: హోటల్ రూంలో TS యువకుడు, ఆంధ్రా యువతి.. కాసేపటికి మంటల్లో ఇద్దరూ.. షాకైన సిబ్బంది