YSRCP Internal Politics : వైఎస్ఆర్‌సీపీలో నివురుగప్పిన నిప్పులా అంతర్గత కలహాలు - హైకమాండ్ ఎందుకు లైట్ తీసుకుంటోంది ?
వైఎస్ఆర్‌సీపీలో అన్ని జిల్లాలో అసంతృప్తి స్వరాలు పెరిగిపోతున్నాయి. కానీ హైకమాండ్ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈ గొడవలు పార్టీకి నష్టం చేస్తున్నాయన్న ఆందోళన క్యాడర్‌లో కనిపిస్తోంది.
YSRCP Internal Politics : తనకు అన్యాయం చేశారని సొంత పార్టీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలి ఇంటి ముందు అర్థరాత్రి పూట ఓ ఎమ్మెల్యే ధర్నా చేశారు. పార్టీలో తనపై కుట్ర జరుగుతోందన్నారు. అంతకు ముందే మాజీ మంత్రి అనిల్ కుమార్.. తనపై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారని . .. అన్నీ బయట పెడతానంటున్నారు. నిజానికి ఇవి ఒకటి .. రెండు రోజుల్ోల జరిగినవే. నిజానికి ప్రతి జిల్లాలో దాదాపుగా మెజార్టీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్‌సీపీలో ఆధిపత్యపోరాటం సాగుతోంది. దీంతో విభేదాలు పార్టీని బలహీనపరిచేలా ఉంటున్నాయి. కానీ హైకమాండ్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్‌సీపీ అంతర్గత రాజకీయాలు హీట్ !
వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత కలహాలు.. అసమ్మతి.. అసంతృప్తి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొందరు బయట పడుతున్నారు. మరికొందరు వేచి చూస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంత కాలం ఏదైతే తన బలం అని భావిస్తుందో అదే మైనస్ అవుతోంది. మొన్నటి వరకూ ఎవరూ బయటపడలేదు. కానీ పార్టీలో ఐక్యత అన్నది మంత్రి వర్గ విస్తరణతో నీటి బుడగలా పేలిపోయింది. పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. పార్టీలో అధినేతకు సన్నిహితులుగా పేరుపడ్డ వారు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక్క సారిగా పార్టీ అత్యంత బలహీనంగా మారిపోయిందని అనిపించే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అసంతృప్తి బయటపడని విధంగా జగన్‌కు పార్టీపై పట్టు !
వైఎస్ఆర్‌సీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరాటం శ్రుతి మించి సొంత పార్టీలో ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకునే దిశగా వెళ్తున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే మీడియా ముందుగా చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి కుట్రలు చేస్తున్నారని.. వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతలు ఇలా బహిరంగంగా చెప్పుకున్నారు. ఇంకా పలువురు నేతలు లోలోపల రగిలిపోతున్నారు. త్వరలో మరికొంత మంది బయటపడవచ్చని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. హైకమాండ్ జిల్లాలో నాయకుల మధ్య ఆధిపత్య పోరాటంపై తక్షణం దృష్టి పెట్టాలన్న సూచనలు చేస్తున్నారు. మాజీ మంత్రులు అనిల్ కుమార్.. బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే కాదు చాలా మంది అదే తరహాలో ఆరోపణలు చేస్తున్నారు. ఆధిపత్య పోరాటంలో భాగంగానే ఇలా చేస్తున్నారని వారు నేరుగానే చెబుతూంటారు. పార్టీపై పట్టు కోసం.. బాలినేని ప్రాధాన్యాన్ని తగ్గించడానికి ఇలా చేస్తున్నారని అంటారు. అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తనను బలహీన పరచాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అంటున్నారు
నేతల మధ్య ఆధిపత్య పోరాటమే కారణమా ?
పార్టీలో అంతర్గత రాజకీయాల కారణంగా పార్టీ నేతలను ఒకరికొకరు దెబ్బతీసుకునే వ్యూహాలను కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతుల చెప్పుకుంటున్నారు. ప్రతి జిల్లాలో దాదాపుగా సగం నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందంటున్నారు. పార్టీలో ముఖ్య నేతల వద్ద ప్రాపకం సంపాదించి ప్రత్యేకంగా వర్గం ఏర్పాటు చేసుకుని పోటీగా ఉన్న వారిపై పైచేయి సాధించడానికి వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లే పార్టీ నేతలకు చెందిన అనేక రకాల వివాదాస్పద వ్యవహారాలు మీడియాలో హైలెట్ అవుతున్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఆడియోలతో పాటు ఇతర నేతలపై వస్తున్న పలురకాల అవినీతి, అవకతవకల వ్యవహారాలకు సొంత పార్టీ నేతలే కారణమన్న ఆరోపణలు వైఎస్ఆర్‌సీపీ నేతల్లోనే వినిపిస్తున్నాయి.
హైకమాండ్ జోక్యం చేసుకోవాలని విన్నపం
పార్టీ నేతల మధ్య విభేదాలను సర్దుబాటు చేయకపోవడంతోనే ఇలాంటి సమస్య వస్తోందని.. తక్షణం హైకమాండ్ కల్పించుకోవాలన్న అభిప్రాయం పార్టీ క్యాడర్‌లో వినిపిస్తోంది. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తల బాధ్యతలను విజయసాయిరెడ్డికి ఇచ్చారు. దీంతో నేతలు వర్గాలుగా విడిపోయి కొంత మంది సజ్జల వద్దకు.. మరికొంత మంది విజయసాయి వద్దకు వెళ్తూండటంతో పరిస్థితి మరితం జఠిలం అవుతోందని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడు జోక్యం చేసుకుని సరి దిద్దకపోతే .. పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.