Kadapa Diamond Mines : కడపలో వజ్రాల గనులు - మైనింగ్‌కు త్వరలో లైసెన్స్‌లు !
కడప జిల్లాలో వజ్రాల గనులు ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. నాలుగో స్థాయి సర్వేలో గుర్తించారు. మైనింగ్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో వజ్రాల గనులు ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ విభాగం దేశవ్యాప్తంగా కొత్త గనులపై సర్వే నిర్వహించింది. జీ-4 స్థాయి అంటే ప్రాథమిక అంచనా సర్వే నిర్వహించి దాదాపుగా వంద చోట్ల వివిధ రకాల గనులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఎక్కువగా ఉంది. ఏపీలో పలు చోట్ల అత్యంత విలువైన గనులు ఉన్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా కడప జిల్లాలో వజ్రాలు లభించే ప్రాంతాలు ఉన్నట్లుగా నివేదికలను ఏపీ ప్రభుత్వానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చింది.
కడప జిల్లాలో 37 కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యత
కడప జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్టు నివేదికలో తెలిపింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాకాలం ప్రారంభమైతే పెద్ద ఎత్తున పొలాల్లో ప్రజలు వెదుకులాట ప్రారంభిస్తారు. ఆ ప్రాంతాలలోఅధిక భాగం ఎర్ర నేలలున్నాయి. రంగురాళ్లు కలిగిన ఈ ఎర్రనేలల్లో తొలకరి చినుకులు కురిసిన తరవాత వజ్రాలు దొరుకుతాయన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. పలుమార్లు దొరికాయి కూడా. ఈ కారణంగా తొలకరి వచ్చినప్పుడు వేలల్లో జనం ఆ ఎర్రనేలల వద్దకు వెళ్తారు. రంగురాళ్లను వెదుకుతారు.
Also Read : కాకా హోటల్‌కు కోట్లలో కరెంట్ బిల్లు
కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో వజ్రాలు ఉంటాయని గతంలోనే నివేదికలు !
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాల్లో వజ్రాల నిక్షేపాలున్నాయని ఎప్పటి నుంచో నివేదికలు ఉన్నాయి. కార్బన్ ధాతువులు భూమి అడుగున అత్యధిక ఉష్ణోగ్రత, ఒత్తిడికి లోనైనప్పుడు గట్టిపడి వజ్రాలుగా మారతాయి. ఈ ప్రక్రియ భూఉపరితలం నుంచి 140 నుంచి 190 కిలోమీటర్ల దిగువన జరుగుతుంది. అంతకంటే దిగువన మాగ్మా ప్రవహిస్తుంటుంది. దీనినే లావా అని కూడా అంటారు. అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా ఆ లావా ఒకోసారి అత్యంత వేగంగా పైపు ఆకారంలో భూఉపరితలానికి చేరి విస్ఫోటనం చెందుతుంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాలు లభించే కింబర్లైట్ పైపులు భూఉపరితలానికి అతి దగ్గరలో ఉన్నాయని ఆర్కియాలజీ నిపుణులు చెబుతున్నారు.
Also Read : ఆ సెక్షన్ కింద కేసులొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశం
ఏపీలో భారీగా మాంగనీస్ నిల్వలు !
అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో కడప జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వజ్రాల లభ్యత ఉందని తేల్చారు. అలాగే ఇతర ఖనిజాల గురించిన సమాచారం కూడా ఇచ్చారు. నెల్లూరు జిల్లా మాసాయపేట, శ్రీకాకుళం జిల్లా ములగపాడు, విశాఖ జిల్లా నందా, విజయనగరం జిల్లా గరికపేట, శివన్నదొర వలస, బుద్ధరాయవలస తదితర చోట్ల బేస్ మెటల్ , మాంగనీస్ నీల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలో 2 ఐరన్ ఓర్ బ్లాక్‌లు ఉన్నట్లుగా గుర్తించారు.
Also Read : తెలంగాణలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ
మైనింగ్ లీజు దారుడు మరో మూడు సర్వేలు నిర్వహించి వజ్రాలు వెలికి తీయాలి..!
ప్రస్తుతం గుర్తించిన బ్లాక్‌లకు మైనింగ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. గత నిబంధనల ప్రకారం మైనింగ్‌కు అనుమతి లేదు. అయితే ఇటీవల నిబంధనలు మార్చారు. గనుల్ని లీజుకివ్వనున్నారు. అయితే వేలంలో లీజులు తీసుకున్న వారు వెంటనే మైనింగ్ చేసుకునే అవకాశం ఉండదు. ఆ బ్లాకుల్లో ఖనిజం ఎక్కడ, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సొంతంగా మొదటి మూడు స్థాయిల సర్వేలు సనిర్వహించాలి. ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నాలుగో స్థాయి సర్వే మాత్రమే నిర్వహించింది. ఇప్పుడు ఇచ్చే లీజులను కాంపోజిట్ లైసెన్స్‌లుగా పేర్కొంటారు. ఇక కడప జిల్లాలో వజ్రాల వేటకు లైసెన్స్‌లు ఇవ్వడమే మిగిలి ఉంది.