AP Employees : పీఆర్సీ నివేదిక కోసం ఆందోళన..ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘ నేతల మెరుపు ధర్నా !
ప్రభుత్వం పీఆర్సీ కాదు కదా.. పీఆర్సీ నివేదిక కూడా ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ధర్నాకు దిగారు. దీంతో ఏపీ సచివాలయంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు మెరుపు ధర్నాకు దిగారు. వెలగపూడి సచివాలయలో రెండో బ్లాక్ ఎదురుగా బైఠాయించారు. పే రివిజన్ కమిషన్ సిఫారసులను తక్షణమే బయట పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ విషయంలో కనీసం నివేదిక కూడా ఇవ్వకుండా ఆలస్యం చేయడంపై ఉద్యోగ సంఘ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. నివేదిక ఇచ్చి తీరాలని సర్కార్‌కు మంగళవారమే ఒక్క రోజు డెడ్ లైన్ పెట్టారు. బుధవారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాల్నారు. అయితే ప్రభుత్వం వారి డెడ్‌లైన్‌ను లైట్ తీసుకుంది. దీంతో వారు సచివాలయంలో ధర్నాకు దిగారు.
పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో కానీకనీసం నివేదిక అయినా అందితే దాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచొచ్చని ఉద్యోగ సంఘ నేతలు భావిస్తున్నారు. అయితే పీఆర్సీ నివేదిక ఇచ్చేస్తామంటూ ప్రతీ రోజు చెబుతున్నారు కానీ ఇవ్వడం లేదు. ఉద్యోగ సంఘ నేతలు ప్రతీ రోజు సీఎస్ ఆఫీస్ దగ్గర పడిగాపులు పడటం సహజమైపోయింది. తాము ప్రతి రోజూ తిరగడమే సరిపోతుంది కానీ.. ప్రభుత్వం స్పందించడం లేదని ఉద్యోగ సంఘ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు అంటున్నారు.
పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నారని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన కోట్లాది రూపాయల పెండింగ్ నిధుల విడుదలపై కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాడ్ చేస్తున్నారు. 2018 జూలై 1 నుంచి పీఆర్సీని అమలు చేయాలని, ఈ తేదీకి ఒక్క రోజు తక్కువైనా మేం ఒప్పుకోబోమని చెబుతున్నారు.0లాగే 60 శాతం మేర పీఆర్సీ ప్రకటించాలని కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతల ఆందోళన గురించి తెలిసిన సీఎస్ సమీర్ శర్మ పీఆర్సీ నివేదిను బహిరంగ పరిచేందుకు అనుమతి కోసం సీఎంవోను సంప్రదిస్తున్నారు.
Also Read : పరిటాల - జేసీ ఆత్మీయ పలకరింపు..అనంతపురం టీడీపీ నేతలకు స్వీట్ షాక్ !
గత నెలలో ఓ సారి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అక్టోబర్ నెలాఖరు కల్లా పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తరవాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కానీ పీఆర్సీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం ఏదీ చేయలేదు. వీరు ఇలా ధర్నాకు దిగడానికి ముందే మరో ఉద్యోగ సంఘం అయిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమ జీపీఎఫ్ నిధులు కూడా ఇవ్వడం లేదని.. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇలా ఉద్యోగ సంఘాలు మూకుమ్మడిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.
Also Read : ఎయిడెడ్ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?