Nellore News : ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వెళ్లిన కలెక్టర్.. కార్యాలయంలో లేరని ఉద్యోగుల సస్పెన్షన్ ! అవాక్కయ్యారా ?
ఎవరైనా ఆఫీస్ అవర్స్‌లో ఆఫీసులో లేకపోతే సస్పెండ్ చేస్తారు. కానీ నెల్లూరు కలెక్టర్ మాత్రం భిన్నం. ఆఫీసు సమయం ముగిసిన తరవాత తాను ఆకస్మిక తనిఖీలకు వస్తే లేరని ఉద్యోగుల్ని సస్పెండ్ చేసేశారు.
గ్రామ, వార్డు సచివాలయంలో ఉద్యోగులంతా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలని బయోమెట్రిక్ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఐదు గంటల తర్వాత వారు ఇంటికి వెళ్లొచ్చు. అయితే ఐదు గంటల తర్వాత ఇంటికి వెళ్లిపోయారని చెప్పి ఓ గ్రామ సచివాలయంలో ఉద్యోగులందర్నీ సస్పెండ్ చేసి పడేశారు కలెక్టర్. ఇది కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఆకస్మిక పర్యటనకు ఐదు గంటల తర్వాత గ్రామ సచివాలయానికి వచ్చిన కలెక్టర్‌కు ఎవరూ కనిపించలేదు. తానొచ్చినా ఎవరూ ఉండరా అని చెప్పి సస్పెండ్ చేసి పడేశారు. కలెక్టర్ వస్తారని తెలియక సమయం ముగియగానే వెళ్లిపోయామని.. తమ తప్పేం ఉందని వారు లబోదిబోమంటున్నారు. కానీ కలెక్టర్ ఈజ్ ఆల్వేస్ రైట్ కాబట్టి.. ఏదో విధంగా తమ సస్పెన్షన్ ఎత్తి వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన నెల్లూరులో జరిగింది.
నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అక్టోబర్ 5న ఇందుకూరుపేటలో పర్యటించారు. వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు తిరిగి వెళ్తుండగా ఆయనకు గ్రామ సచివాలయాలను అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలన్న ఆదేశం గుర్తుకు వచ్చినట్లుగా ఉంది. వెంటనే... అక్కడ సమీపంలో ఎక్కడ గ్రామ సచివాలయం ఉందో చూసి వాహనం ఆపాలని డ్రైవర్‌ని ఆదేశించారు. ఆ ప్రకారం డేవిస్ పేట సచివాలయం దగ్గర ఆగారు. అయితే కారు దిగి చూసిన కలెక్టర్‌కు ఆ గ్రామ సచివాయానికి తాళం వేసి ఉండటం కనిపించింది. అంతే.. ఆయనకు కోపం వచ్చేసింది.
Also Read : పరిటాల - జేసీ ఆత్మీయ పలకరింపు..అనంతపురం టీడీపీ నేతలకు స్వీట్ షాక్ !
వెంటనే కారెక్కి వెళ్లిపోయారు. తర్వాత సచివాలయంలో లేని ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డేవిస్ పేట గ్రామ సచివాలయంలో పని చేసే మహిళా పోలీస్ శ్రావ్య, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ నవీన్ కుమార్, డిజిటల్ అసిస్టెంట్ సుప్రజ, వెటర్నరీ అసిస్టెంట్ శ్యామల, సర్వ్ అసిస్టెంట్ అవంతి, హార్టికల్చర్ అసిస్టెంట్ సుజాత ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. పంచాయతీ కార్యదర్శి తిరుపతయ్య, ఏఎన్ఎం సుచిత్ర, లైన్ మెన్ కృష్ణకు చార్జి మెమో ఇచ్చారు.
Also Read : ఎయిడెడ్ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?
నిజానికి డేవిస్ పేట గ్రామ సచివాలయం సిబ్బంది ప్రభుత్వ నిబంధన ప్రకారం ఐదు గంటల వరకూ ఆఫీసులో ఉన్నారు. సమయం ముగిసిన తర్వాత బయోమెట్రిక్ పంచ్ కొట్టి ఇళ్లకు వెళ్లిపోయారు. వారి తప్పేంలేదు. కానీ కలెక్టరే పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఒక వేళ కలెక్టర్ వస్తారని తెలిస్తే పది నిమిషాలు కాదని.. పది గంటల వరకు అయినా ఉండేవాళ్లమని వాళ్లు మొత్తుకుంటున్నారు. ఆకస్మిక తనిఖీలు ఆఫీసు సమయం అయిపోయిన తర్వాత చేస్తే ఎలా అని వారు వాపోతున్నారు. అయితే వారి బాధ పట్టించుకునేవారెవరూ లేరు. ఇక్కడ తప్పెవరిదో కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం బలైపోయారు.