AP Cabinet Inside : జూలై నుంచి విశాఖకు వెళ్తున్నాం - కేబినెట్ భేటీలో మంత్రులతో చెప్పిన సీఎం జగన్ !
జూలైలో విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు సీఎం జగన్ తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Cabinet Inside : జూలై నుంచి విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆమోదించాల్సిన బిల్లుల కోసం కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అధికారికంగా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖ నుంచి పరిపాలన గురించి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి నుంచే పరిపాలన చేస్తారని కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అదే చెబుతున్నారు. ఉగాది వేడుకల్ని కూడా విశాఖలోనే నిర్వహించాలనుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడే కాదని సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీతో స్పష్టమయిందని మంత్రులు ఓ అభిప్రాయానికి వచ్చారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ గెలవాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం జగన్
ఇదే భేటీలో కొంత మంది మంత్రులపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు స్థానాలకు జరుగుతున్నాయి. ఓ స్థానానికి టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టారు. అధికారికంగా టీడీపీకి ఇరవై మూడు మంది సభ్యులు ఉన్నారు. అధికార పక్షం నుంచి కొంత మంది గైర్హాజర్ అయితే టీడీపీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే మంత్రులకు సీఎం జగన్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని అందరూ వచ్చి ఓటు వేసేలా చూడాలన్నారు.
విపక్ష నేతలు చేసే ఆరోపణలు బలంగా తిప్పి కొట్టాలని ఆదే్శం
మరో వైపు విపక్ష నేతలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు తిప్పి కొట్టడంలో కొంత మంది మంత్రులు ఆసక్తి చూపించకపోవడంపై కూడా సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కొద్ది మంది మంత్రులు మాత్రమే.. విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారని..ఇతరులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నందున.. విపక్షం చేసే ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ఏమైనా తేడాలు వస్తే... మంత్రివర్గంలో మార్పు, చేర్పులు ఉంటాయని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
ఉపాధ్యాయ, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుస్తామన్న మంత్రులు
మంత్రివర్గ సమావేశంలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపైనా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. రెండు ఉపాధ్యాయ, మూడు గ్రాడ్యూయేట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్నింటిలోనూ వైఎస్ఆర్‌సీపీ విజయం సాధిస్తుందని పలువురు మంత్రులు సీఎం జగన్ కు చెప్పారు.ఎన్నికల బాధ్యతలు తీసుకున్న పలువురు మంత్రులు క్షేత్ర స్థాయి పరిస్థితిని సీఎం జగన్‌కు వివరించిటన్లుగా తెలుస్తోంది. బాగా కష్టపడిన మంత్రులను సీఎం జగన్ అభినందించారు.